*ఆత్కూరు (ఉంగుటూరు) : మే 01 (ప్రజా అమరావతి);
*స్వదేశీ అభిమానం పెంచుకోవాలి -- భారత మాజీ ఉపరాష్ట్రపతి
*
మన దేశంలో తయారైన వస్తువులపై ప్రతి ఒక్కరూ ఇష్టం పెంచుకోవాలని, దేశ ఉత్పత్తులను ప్రోత్సహించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
సోమవారం ఆయన ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ లో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందుతున్న శిక్షణార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ధృవ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులను విదేశీయులు పరిపాలించడంతో మనందరికీ విదేశీ వ్యామోహంపై మక్కువ పెరిగిందని, దానిని వ్యతిరేకించి ప్రతి ఒక్కరూ స్వదేశీయతపై ఆసక్తి పెంచుకోవాలని, మన అనే దాన్ని ప్రోత్సహించాలని కోరారు. మన సంస్కృతి, ఆహారం, పద్ధతులు ఎప్పటికీ మర్చిపోకూడదని, మన దేశం.. స్వదేశీతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. తాను 90 కి పైగా విదేశాలలో పర్యటించానని అయితే వారి ఆహారపు రుచులు మన ఇడ్లీ, వడ, పూరి, దోసె వంటి వంట రుచులకు సరిరావని గత జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులో అలవాటైన చెడు అలవాట్లు అంత సులభంగా పోవు అని, చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి పని చేసినప్పుడు కూడా అభినందించే తత్వం ఉండాలని, ఆ మంచి పనిని నలుగురికి చెప్పడం ద్వారా దానిని నుంచి ఇతరులు స్ఫూర్తి పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షణార్ధులకు ధ్రువ పత్రాలను అందించారు. విద్యార్థులను పేరుపేరునా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ యువత, మహిళల జీవితాలలో వెలుగులు నింపేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, స్వర్ణ భారత్ ట్రస్ట్ సీఈవో శరత్ బాబు, సెక్రెటరీ చుక్కపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment