*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*
విజయవాడ (ప్రజా అమరావతి);
*సకాలంలో జగనన్న విద్యాకానుక కిట్ అందించాలి.. నాణ్యతలో రాజీ లేదు
*
• జిల్లా స్థాయిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
• ప్రతి శుక్రవారం సమీక్షా సమావేశం
• కిట్ లో వస్తువులు నాణ్యత లోపిస్తే వెండర్లను ‘బ్లాక్ లిస్ట్’ లో చేరుస్తాం
• వెండర్లతో, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు
జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే ప్రతి వస్తువు నాణ్యత బాగుండేలా తయారు చేయాలని, నాణ్యతలోపిస్తే సహించేది లేదని, విద్యార్థులకు సకాలంలో కిట్ అందించాలని జేవీకే వెండర్లను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.
శుక్రవారం వెండర్లతో, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీలు, బెల్టులు, బ్యాగులు వంటివి ఇచ్చి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని, హుందాతనాన్ని నింపే కార్యక్రమంగా గొప్ప పేరు సాధించుకున్న పథకం ‘జగనన్న విద్యాకానుక’ అని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా సునిశిత పరిశీలనతో విద్యాకానుకపై దృష్టి సారించారనిపేర్కొన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా మనమంతా ముందుకు సాగాలని అన్నారు. జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని వ్యాపారధోరణితో చూడకుండా సొంతబిడ్డలకు ఇచ్చే కానుకలా ఉండేలా భాగస్వాములవ్వాలని వెండర్లను కోరారు.
దేశంలో విద్యార్థులకు ఉచితంగా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు, ప్రాథమిక స్థాయి పిల్లలకు వర్క్ బుక్స్ వంటివి ఇచ్చి చరిత్రపుటల్లో నిలిచిన ఏకైక మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా గొప్ప ప్రచారం వచ్చి, చక్కని ఆదరణ పొందిందని అన్నారు.
విద్యార్థులకు గతంలో ఇచ్చిన బూట్లు, బ్యాగుల విషయంలో అక్కడక్కడ విమర్శలు వినిపించినా.. ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందునుంచే ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
*నాణ్యత లోపిస్తే వెండర్లను ‘బ్లాక్ లిస్టు’ లో చేర్చుతాం*
జగనన్న విద్యాకానుకలో ఇచ్చిన ఏ వస్తువులోనైనా నాణ్యత లోపిస్తే రాజీపడేదే లేదని అన్నారు. నాణ్యత లోపిస్తే దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు, ప్రపంచంలో పేరెన్నికగన్న అన్ని ప్రముఖ సంస్థలకు లేఖ రాసి ‘బ్లాక్ లిస్ట్’లో చేర్పిస్తామని వెండర్లను కఠినంగా హెచ్చరించారు. జగనన్న విద్యాకానుక నాణ్యత, సరఫరాలలో అలసత్వం విషయాల్లో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి కిట్ బాగాలేదనే మాట రాకూడదనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త కోసం కంపెనీలకు స్వయంగా వెళ్లి తనిఖీ చేసి, నాణ్యత కోసం వెండర్లకు పలు సూచనలు ఇచ్చామని అన్నారు. ప్రతి విద్యార్థి తమ సొంత బిడ్డలా భావించి ఉత్తమమైన కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని వెండర్లను, విద్యాశాఖా ఉన్నతాధికారులను ఆదేశించారు.
*విద్యార్థులను కిట్ ధరించేలా అలవర్చాలి*
విద్యార్థుల్లో కిట్ ధరించేలా అలవర్చడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అందుకోసం ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో అవగాహన పరచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ప్రతి విద్యా పథకాన్ని మానసపుత్రికలా భావిస్తోందని, ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు సరఫరా చేసిన వస్తువుల్లో ఏవైనా బాగాలేదని ఫిర్యాదు వస్తే ఉపేక్షించేది లేదని, వాటిస్థానంలో కొత్తవి ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ నాణ్యత విషయంలో ఏమైనా అసంతృప్తి చెందితే ఫోటో, వీడియో తీసి, వివరాలతో సహా స్వయంగా ఆయన వ్యక్తిగత వాట్సప్ నంబరుకు (90131 33636)కు సందేశం పంపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు తెలిపారు. అలానే 14417 టోల్ ఫ్రీ నంబరుకు సంబంధిత సమాచారాన్ని ఎప్పుడైనా తెలుపవచ్చన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకునేలా ఆదేశించారు.
*జిల్లాల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి*
మండల స్టాకు పాయింట్లకు కిట్ లో అన్ని వస్తువులు చేరేలా, ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా రాష్ట్రస్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని పరిష్కారం కోసం ఎస్పీడీ, ఏఎస్పీడీ తదితర రాష్ట్రస్థాయి అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఏపీసీ, తదితర అధికారులు చొరవ తీసుకుని కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘జగనన్న విద్యాకానుక కార్యక్రమం విజయవంతం కావడానికి మనసా వాచా కర్మణా ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుని సమిష్టి కృషి చేయాలని కోరారు.
*సరఫరా సకాలంలో చేయాలి*
పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థికి 100 శాతం కిట్ అందాలంటే ఈ నెలాఖరుకు మండల స్టాకు పాయింట్లకు కిట్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అధికారులతో, వెండర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని, ఎప్పటికప్పుడు పురోగతి గురించి వివరించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు , ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు, స్టేట్ సీఈ శ్రీ కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment