యువ సంఘర్షణ’ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ

 హైదరాబాద్‌ (ప్రజా అమరావతి): తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ


కి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అత్యంత వేడిలోనూ సభకు భారీ ఎత్తున తరలివచ్చారని.. తనకు ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.


ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ.. ఇది కేవలం ఒక పటంలోని ప్రాంతం మాత్రమే కాదు. ఇక్కడి ప్రజలకు ఈ నేల అమ్మతో సమానం. రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది యువత ప్రాణత్యాగం చేశారు. అయితే, తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షలు, లక్ష్యాల కోసం ఉద్యమంలో చేరి ప్రాణాలు అర్పించారో.. అవి నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత ఉద్యమించారు. యువత బలిదానాల వల్లే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైంది. రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా ఎంతో మథనపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉంది. మీ ఆకాంక్షలు నెరవేరాలనే ఆమె తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కానీ అలా జరగలేదు’’


*విద్యార్థులను దోచుకుంటున్నారు..* 


‘‘భారత్‌ రాష్ట్ర సమితి (భారాస).. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదు. నయా జాగీర్దార్ల తరహాలో భారాస పాలన కొనసాగుతోంది. తెలంగాణను భారాస ప్రభుత్వం తమ జాగీరుగా భావిస్తోంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఇవేవీ జరగకుండా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేశారు. ఉద్యోగాల భర్తీ చేయట్లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ వర్సిటీలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారు’’


*ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి..* 


‘‘దేశం కోసం నా కుటుంబీకులు కూడా అమరులయ్యారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ కూడా అమరులయ్యారు.  ఇందిరమ్మ చనిపోయి ఏళ్లు గడిచినా ఆమెను ప్రజలు  స్మరించుకుంటున్నారు. నేను ఇందిరమ్మను స్మరిస్తూ.. ఆమె ఆశయాలు నెరవేరుస్తా. దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేసిన పనులను పేర్లు మార్చి తమవిగా చెప్పుకొంటున్నారు. మీరు మీ భవిష్యత్తును సంరక్షించుకోవలన్నా.. మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టపోయేది ప్రజలే. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. అలా జరగకపోతే మమ్మల్ని పక్కనపెట్టండి. తెలంగాణ ప్రజలను ఇకపై కలుస్తూనే ఉంటాను. సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాం’’ అని అన్నారు.

Comments