మహానాడును ఒక విజయోత్సవంగా నిర్వహిస్తాం.

 *- మహానాడును ఒక విజయోత్సవంగా నిర్వహిస్తాం* 


 *- చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్న వెనిగండ్ల*గుడివాడ, మే 23 (ప్రజా అమరావతి): రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడును ఒక విజయోత్సవంగా నిర్వహిస్తామని టీడీపీ నేత వెనిగండ్ల రాము చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మహానాడు-2023 నిర్వహణకు సంబంధించి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అనుభవం, నిష్ణాతులతో కూడిన 15 కమిటీలను నియమించడం జరిగిందన్నారు. 27న పార్టీలోని బూత్ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అన్ని విభాగాలతో సదస్సులను నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం, మహానాడులో ప్రకటించాల్సిన తీర్మానాలపై చర్చిస్తారన్నారు. 28వ తేదీన దేశ, విదేశాల నుండి వచ్చే దాదాపు 15 లక్షల మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడుకు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వరుస విజయాలను నమోదు చేసిందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజకీయ కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహించడం పార్టీకి శుభపరిణామమని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు కంచుకోట అని అన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ గెలుపొందిందని తెలిపారు. మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ విజయం సాధించిందన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 19 స్థానాల్లో 12 టీడీపీ, ఒకటి బీజేపీ గెల్చుకున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ పార్టీ క్యాడర్లో ఎక్కడా ఆత్మస్థైర్యం తగ్గలేదన్నారు. 2024 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని స్థానాలను గెల్చుకుంటామన్నారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు సంకేతాలిచ్చారన్నారు. ప్రజలందరికీ చేరువయ్యే పథకాలతో మేనిఫెస్టోను రూపొందించే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు లేకుండా, ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా పథకాలకు రూపకల్పన జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రభంజనంలా దూసుకుపోతోందన్నారు. రాజమహేంద్రవరంలో జరిగే టీడీపీ మహానాడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వెనిగండ్ల అభిప్రాయపడ్డారు.

Comments