జిల్లా న్యాయమూర్తుల నూతన నివాస భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన


నెల్లూరు, మే 6 (ప్రజా అమరావతి): జిల్లా న్యాయమూర్తుల  నూతన నివాస భవన సముదాయ  నిర్మాణానికి శంకుస్థాపన


కార్యక్రమం ఘనంగా జరిగింది.  

 శనివారం ఉదయం నగరంలోని కిమ్స్ వైద్యశాల సమీపంలో న్యాయమూర్తుల నివాస భవన సముదాయ  నిర్మాణాలకు కేటాయించిన స్థలంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ డి రమేష్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుమారి యామిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  తొలుత  గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరితగతిన ఈ భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే కేసుల పెండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. 

 అనంతరం నిర్వహించిన సభను హైకోర్టు న్యాయమూర్తి రమేష్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుమారి యామిని  జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం జిల్లా కోర్టులో నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసామని, అవి త్వరలోనే నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానున్నాయని చెప్పారు. అలాగే న్యాయమూర్తుల నివాస భవన సముదాయాన్ని కూడా వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో నిర్మించి అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పాలన సౌలభ్యం కోసం కోర్టుల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలుత జిల్లాలో కోర్టుల పనితీరు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుమారి యామిని క్లుప్తంగా వివరించారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో న్యాయమూర్తులు పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి రమేష్ కు న్యాయమూర్తులు ఘన స్వాగతం పలికారు. 

 అనంతరం హైకోర్టు న్యాయమూర్తి రమేష్ దంపతులను న్యాయమూర్తులు ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. 

 ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్, స్టేట్ బార్ కౌన్సిల్ నెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ అన్వర్ బాషా, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


Comments