వ్యవసాయం మరింత సులభతరం కావాలి.



*వ్యవసాయం మరింత సులభతరం కావాలి*



పార్వతీపురం, మే 6 (ప్రజా అమరావతి): ప్రభుత్వం క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లు వినియోగించుకొని వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర రైతులను కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా పాలకొండ మండలం లుంబూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని, కస్టమ్ హైరింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్  తో కలసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ వద్ద ఆధునిక వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. రైతులకు యాంత్రీకరణ పనిముట్లు ఏ ధరలకు అద్దెకు ఇస్తున్నది ఆరా తీశారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి నిర్దేశించిన విధంగా రైతులకు అందజేస్తున్నట్లు వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను రైతులు వినియోగించుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని సూచించారు. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించవచ్చని అన్నారు. రైతు భరోసా కేంద్రంలోని కియోస్కో సేవలు ఎంతమేరకు అందుతున్నవి మండల వ్యవసాయ అధికారిని అడిగితెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం పరిధిలో సాగు విస్తీర్ణం, ఎంతమంది రైతులు స్వంతంగా వ్యవసాయ భూమి సాగుచేస్తున్నారు, కౌలు రైతులు ఎందరు ఉన్నది, ఇ- క్రాప్ నమోదు తదితర అంశాల వివరాల రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన ద్వారా రైతులకు మరింత మేలుచేసే పథకాల రూపకల్పనకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, ఇంచార్జి తహశీల్దార్ బుచ్చయ్య, గ్రామ వ్యవసాయ సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments