జాతీయ సాంకేతికత వారోత్సవాల్లో విజయనగరం విద్యార్థుల ప్రదర్శన.

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*

అమరావతి (ప్రజా అమరావతి);

*జాతీయ సాంకేతికత వారోత్సవాల్లో విజయనగరం విద్యార్థుల ప్రదర్శన


*

• అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ

• వ్యవసాయ (బయో) వ్యర్థాలతో బ్యాగుల తయారీ ప్రాజెక్టు

దిల్లీలోని ప్రగతి మైదానంలో గురువారం జరిగిన ‘జాతీయ సాంకేతికతా వారోత్సవం 2023’లో ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ వ్యర్థాలతో బ్యాగులు తయారీ (పేపర్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్) ప్రాజెక్టును ప్రదర్శించినట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు. ‘జాతీయ సాంకేతికతా వారోత్సవం 2023’ కార్యక్రమాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ  ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 40 అటల్ టింకరింగ్ ల్యాబ్ లు పాల్గొనగా, మన రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లా ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ కు ఈ అవకాశం దక్కింది. తొమ్మిదో తరగతి చదువుతున్న వానపల్లి యశస్విని, మండా మాధురి, వెదురుపర్తి వరప్రసాద్ గైడ్ టీచర్ వానపల్లి రమేశ్ పాల్గొన్నారని తెలిపారు.  

విద్యార్థులు తయారు చేసిన పేపర్ ప్లేటులు, ప్లాంట్ పాట్స్, హ్యాండ్ బ్యాగులు, స్టేషనరీ ఫైల్స్, గిప్ట్ ప్యాకింగ్ బాక్సులు వంటివి ప్రదర్శించారు.  ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు, కేంద్ర మంత్రులు, శాస్త్రవేత్తలు తదితరులు తిలకించారు.  డీఆర్డీవో (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) చైర్మన్‌, భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డా. జి.సతీష్ రెడ్డి  విద్యార్థులను అభినందించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులకు, గైడ్ టీచరుకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ , సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి  ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

*ఈ ప్రాజెక్టు ఆశయం - ప్రత్యేకత ఇదీ...*

మహాసముద్రాల్లో 2030 నాటికి జలాచర జీవులకంటే ప్లాస్టిక్ పరిమాణమే ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. బాధ్యతారహితంగా ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మానసిక కాలుష్యం, వాతావరణం మార్పుల కారణంగా మిలియన్ల జీవ జాతులు అంతరించిపోతున్నాయి. కాబట్టి భారతదేశం వంటి కొన్ని దేశాలు క్యారీ బ్యాగులు,  స్ట్రాలు,  ప్లాస్టిక్ స్పూన్లు,  టీ గ్లాసులు వంటివి నిషేధించాయి. కాగితంతో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే అటవీ విస్తీర్ణం 30% నుండి 17%కి వేగంగా తగ్గుతోంది. దీనివల్ల కాగితం ఉత్పత్తి కూడా తగ్గి పర్యావరణంలో భారీగా సమతుల్యత లోపిస్తుంది. ఇదే ఈ పిల్లల ఆలోచన. ప్లాస్టిక్, కాగితం వినియోగించకుండా పర్యావరణాన్ని రక్షించాలని అనుకున్నారు. 

కాగితం మరియు ప్లాస్టిక్ రహిత ప్రత్యామ్నాయాలుగా వ్యవసాయ జీవ (బయో) వ్యర్థాలను, ప్యాకేజింగ్ మెటీరియల్, మొక్కల కుండలు, స్టేషనరీ వంటి వాటికి పొడి అరటి కాండం పీల్స్‌, కలప స్థానంలో కలుపు మొక్కల కాండం వంటి అరోండా డోనాక్స్‌ను ఉపయోగించి పేపర్ ప్లేటులు, ప్యాకింగ్ బాక్సులు, పూలకుండీలు వంటివి తక్కువ ఖర్చుతో చేసి శభాష్ అనిపించుకున్నారు. తద్వారా వ్యవసాయ జీవ వ్యర్థాల ద్వారా రైతులకు అదనపు ఆదాయం, పర్యావరణ కాపాడుకోవడం సులభమవుతుందంటారు ఈ చిన్నారులు.




Comments