నాణ్యమైన సేవలు అందించాలి.

 *నాణ్యమైన సేవలు అందించాలి*


*: ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి*


*: అధికారులపై నమ్మకం కలిగే విధంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి*


*: సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం*


*: అత్యవసర పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకం*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 16 (ప్రజా అమరావతి):


ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని, సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు హెచ్చరించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పెనుకొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, డిఎస్ఓ, డిఎల్ఎస్ఓ, తహసిల్దార్లు, డిఐఓలతో రీ సర్వే, ఎఫ్పిఓఎల్ఆర్, మ్యుటేషన్స్, హౌస్ సైట్స్, స్పందన, కోర్టుకేసులు, వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, తదితర అంశాలపై జిల్లా స్థాయి రెవెన్యూ కాన్ఫరెన్స్ ను జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు అధికారులు ఎక్కువ కష్టపడి పనిచేయాలన్నారు. అధికారులంతా ప్రజలతో మంచి తస్సంబంధాలు కొనసాగించాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలన్నారు. సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అధికారులపై నమ్మకం కలిగే విధంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ, సర్వే శాఖ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని, ఆయా శాఖలు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. నిజంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంలో అధికారులు బాధ్యత వహించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అర్హత కలిగిన వారికి భూమి కేటాయించేటప్పుడు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే అధికారులకే ఇబ్బందులు కలుగుతాయన్నారు. కోర్టు కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ఆర్డీవోలు, తహసిల్దార్ సంబంధిత అధికారులతో ప్రతిరోజు సమస్యల పరిష్కారం పై సమీక్ష నిర్వహించుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణంలో రెవెన్యూ శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. అన్ని లేఔట్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆదాయ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల మంజూరులో ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సకాలంలో ధృవీకరణ పత్రాలను అందించాలన్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందించే అధికారం ఒక తహసీల్దారులకే ఉందని, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలకు సంబంధించి భూముల కేటాయింపు విషయంలో త్వరితగతిన భూమిని కేటాయించాలన్నారు. ధ్రువీకరణ పత్రాల మంజూరులో గోరంట్ల, మడకశిర, ఓడి చెరువు, కదిరి, పుట్టపర్తి, నల్లమడ, సోమందేపల్లి, బుక్కపట్నం తదితర మండలాలలో వెనుకబడి ఉందని, ఆయా మండలాల తహసీల్దారులు వెంటనే ధ్రువీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఏదైనా పని చేయగలిగితే చేయాలన్నారు. రీ ఓపెన్ పిటిషన్లకు సంబంధించి లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తికరంగా నాణ్యమైన పరిష్కారం అందించాలని, ఒకవేళ తిరస్కారానికి గురయితే అందుకు తగిన కారణాలు కూడా తెలియజేయాలన్నారు. రెవెన్యూ పరిధిలో అన్ని రకాల అంశాలపై అధికారులు అంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలన్నారు.


ఈ సమావేశంలో డిఆర్ఓ కొండయ్య, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, డిఎస్ఓ వంశీకృష్ణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బాలాజీ, తహసీల్దార్ లు, డిఎల్ఎస్ఓ, డిఐఓలు, తదితరులు పాల్గొన్నారు.



Comments