కాంతులు నింపుతున్న కంటివెలుగు.


 మంగ‌ళ‌గిరి ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌ (ప్రజా అమరావతి);*కాంతులు నింపుతున్న కంటివెలుగు


*

*స‌చివాల‌యం స్థాయి నుంచే సేవ‌లు*

*ఫ్యామిలీ డాక్ట‌ర్‌లో కంటివెలుగును కూడా భాగం చేసే విష‌యాన్ని ప‌రిశీలించండి*

*కంటి వెలుగు కార్య‌క్ర‌మం ఇక‌ మ‌రింత ఉధృతం*

*ఇప్ప‌టికే తొలి రెండు ద‌శ‌లు పూర్తి*

*3 , 4 ద‌శ‌ల కార్య‌క్ర‌మం ఆగ‌స్టు నెలాఖ‌క‌ల్లా పూర్తి*

*కంటివెలుగుపై తాధికారుల పర్య‌వేక్ష‌ణ త‌ప్ప‌నిస‌రి*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*వైఎస్సార్ కంటివెలుగుపై స‌మీక్ష స‌మావేశం*

కంటి వెలుగు కార్య‌క్ర‌మం ద్వారా  రాష్ట్రంలోని ల‌క్ష‌లాది మందికి వెలుగులు నింపుతున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్రధాన కార్యాల‌యంలో సోమ‌వారం వైఎస్సార్ కంటి వెలుగు కార్య‌క్ర‌మంపై మంత్రి విడ‌ద‌ల ర‌జిని స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్ర‌మాన్ని మొత్తం ఆరు ద‌శ‌ల్లో నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి భావించార‌ని తెలిపారు. తొలి రెండు ద‌శ‌ల్లో పాఠ‌శాలస్థాయిలోపు విద్యార్థుల‌కు, త‌ర్వాతి రెండు ద‌శ‌ల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధుల‌కు, మ‌లి రెండు ద‌శ‌ల్లో 18 నుంచి 60 ఏళ్ల లోపు వారంద‌రికీ కంటి ప‌రీక్ష‌లు చేసి స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే ప‌రిష్క‌రించ‌డం ల‌క్ష్యంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని రూపొందించార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే తొలి రెండు ద‌శ‌ల్లో రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లోని విద్యార్థులంద‌రికీ కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌న్నారు. మొత్తం 66.17 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, వీరిలో 1.58 ల‌క్ష‌ల మందికి క‌ళ్ల జోళ్ల అవ‌స‌రం ఉంద‌ని గుర్తించామ‌ని, వారంద‌రికీ క‌ళ్లు జోళ్లు కూడా ఉచితంగా అంద‌జేశామ‌ని వివ‌రించారు. 310 మంది విద్యార్థుల‌కు స‌ర్జ‌రీలు అవ‌స‌ర‌మ‌ని గుర్తించి, ఆయా ఆస్ప‌త్రుల్లో వారికి స‌ర్జ‌రీలు కూడా పూర్తిచేశామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా జ‌గ‌న‌న్న రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులంద‌రికీ కంటి ప‌రీక్ష‌లు ఉచితంగా చేశార‌ని, ఉచితంగా క‌ళ్లు జోళ్లు కూడా పంపిణీ చేశార‌ని, ఉచితంగా స‌ర్జ‌రీలు కూడా చేశార‌ని పేర్కొన్నారు.

*అవ్వాతాత‌ల‌కు ఎంతో మేలు*

2020వ సంవ‌త్సరం జ‌న‌వ‌రి 18వ తేదీన 3, 4 ద‌శ‌ల కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించామ‌ని మంత్రి చెప్పారు. కోవిడ్ వ‌ల్ల మ‌ధ్య‌లో కొంత విరామం వ‌చ్చింద‌న్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు 56,88,424 మంది ఉన్న‌ట్లుగా గుర్తించామ‌ని చెప్పారు. వీరిలో 33, 50, 474 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు. వీరిలో దాదాపు 12 లక్ష‌ల మందికి క‌ళ్ల‌జోళ్లు అవ‌స‌ర‌మ‌ని గుర్తించామ‌న్నారు. వీరిలో ఇప్ప‌టికే 8.9లక్ష‌ల మందికి క‌ళ్లు జోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేశామ‌ని తెలిపారు. 1.9 ల‌క్ష‌ల మందికి కాట‌రాక్ట్ అవ‌స‌ర‌మ‌ని గుర్తించామ‌ని, వీరిలో 88వేల మందికి సంబంధిత స‌ర్జ‌రీలు కూడా చేశామ‌ని చెప్పారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ఉధృతంగా మ‌ళ్లీ చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు తాజాగా 10.14 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించారు. క‌ళ్ల‌జోళ్లు అవ‌స‌ర‌మైన వారంద‌రికీ వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని, స‌ర్జ‌రీలు కూడా పూర్తి ఉచితంగా ప్ర‌భుత్వ‌మే చేయిస్తుంద‌ని వెల్ల‌డించారు. 3, 4 ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన వృద్ధుల‌తోపాటు  చివ‌రి రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన 18 నుంచి 59 ఏళ్ల‌లోపు వారికి కూడా కంటి ప‌రీక్ష‌లను ఇక వేగ‌వంతం చేయ‌నున్నామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానానికి కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని అనుసంధానిస్తే స‌త్ఫ‌లితాలు రావొచ్చేమో ప‌రిశీలించాల‌ని సూచించారు.

*335 క‌మిటీల ద్వారా సేవ‌లు*

వైఎస్సార్ కంటి వెలుగును ఉధృతం చేసేందుకు తాజాగా 335 క‌మిటీల‌ను వేసి, ముందుగానే నిర్ణ‌యించుకున్న‌ షెడ్యూల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఒక్కో టీం రోజుకు 602 చొప్పున‌, మొత్తం అన్ని వైద్య బృందాలు క‌లిపి నెల‌కు రాష్ట్రంలో 5.32 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక రూపొందించామ‌ని, ఆ మేర‌కు ఆయా బృందాలు క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వ ఆశ‌యాలను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఉన్న‌తాధికారులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంతో ఉన్న‌తాశ‌యంతో కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని తీసుకొచ్చార‌ని, అధికారులు బాగా ప‌నిచేస్తేనే ల‌క్ష్యాలు నెర‌వేర‌తాయ‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఏపీవీవీపీ క‌మిష‌న‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, డీహెచ్ రామిరెడ్డి, కంటివెలుగు నోడ‌ల్ ఆఫీస‌ర్ యాస్మిన్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Comments