నాడు నేడు పనులు తనిఖీ చేసిన కలెక్టర్.



*నాడు నేడు పనులు తనిఖీ చేసిన కలెక్టర్


*


పార్వతీపురం/ జియ్యమ్మవలస, మే 21 (ప్రజా అమరావతి): జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి పాఠశాలలో జరుగుతున్న రెండో విడత నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. పెడబుడ్డిడి పాఠశాలలో రూ.65.15 లక్షలతో పనులు మంజూరు చేయగా వాటిలో రెండు అదనపు తరగతి గదులకు రూ.23.34 లక్షలు, నాడు నేడులో పది అంశాలను సమకూర్చుటకు రూ.41.81 లక్షలు ఉన్నాయి. పనుల నాణ్యతలో రాజీపడరాడని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నాడు నేడు లో చేపట్టాల్సిన పది అంశాలను పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అదనపు తరగతి గదుల పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అందించాలని ఆయన అన్నారు. పనులు చక్కగా ఉండాలని, పాఠశాల ఆహ్లాదకర వాతావరణంలోకి మారాలని తద్వారా విద్యార్థులు ఆకర్షితులు కావాలని ఆయన పేర్కొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి కావడానికి జిల్లా విద్యాశాఖ అధికారి, ఏపిఎం, ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటి సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు పనులు చేపట్టిందని, వాటిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.


*సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయాలి*


అన్ని పాఠశాలలకు సకాలంలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, జగనన్న కానుక కిట్లు పంపిణి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెదబుడ్డిడి పాఠశాలలో ఇప్పటికీ చేరిన పుస్తకాలు, జగనన్న కానుక కిట్లు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందస్తు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పాఠశాలలు పునః ప్రారంభం అయిన వెంటనే పంపిణి జరగాలని ఆయన స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Comments