నెల్లూరు, మే 15 (ప్రజా అమరావతి) : వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం ఉదయం వెంకటాచలం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కోసం వైకల్యం నిర్ధారణ వైద్య శిబిరాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తి తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వికలాంగులకు వైకల్యం శాతం ఆధారంగా అతి తక్కువ పింఛన్లు ఇచ్చేవారని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత వికలాంగులకు వైకల్య శాతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు పింఛను అందజేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని వికలాంగులందరికీ అవసరమైన ట్రై సైకిళ్లు, మోటారు వాహనాలు, వినికిడి యంత్రాలు మొదలైన పరికరాలను ఎంపీ గురుమూర్తి ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వం, అలింకో సంస్థ సహకారంతో అందిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, ఎంపీ నిధులతో ఈ పరికరాలను అవసరమైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని అవసరమైన పరికరాలను పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం లో పర్యటించినప్పుడు అనేకమంది వికలాంగులు తమకు పరికరాలు కావాలని మంత్రి గారిని కోరారని, ఆ మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వికలాంగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి పరికరాలను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి సుమారు 28 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు.
అనంతరం వైద్య శిబిరాన్ని మంత్రి, ఎంపీ ప్రారంభించి, వికలాంగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత, మాజీ జెడ్పిటిసి మందల వెంకట శేషయ్య, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి అక్బర్ అలీ, అలింకో సంస్థ ప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, సచివాలయ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వికలాంగులు పాల్గొన్నారు.
addComments
Post a Comment