కలెక్టర్ కార్యాలయంలో మిల్లెట్ స్టాల్ ప్రారంభం.

 


*కలెక్టర్ కార్యాలయంలో మిల్లెట్ స్టాల్ ప్రారంభం


*


*చిరు ధాన్యాలకు ప్రాచుర్యం


పార్వతీపురం, మే 8 (ప్రజా అమరావతి): అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంలో భాగంగా చిరు ధాన్యాలకు ప్రాచుర్యం కల్పించుటకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చిరు ధాన్యాల (మిల్లెట్) స్టాల్  ను ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు స్టాల్ ను ఏర్పాటు చేశారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ చిరు ధాన్యాలకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిరు ధాన్యాల పట్ల ప్రజల్లో అవగాహన ఇంకా పెరగాలని ఆయన పేర్కొన్నారు. చిరు ధాన్యాలు ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదని ఆయన చెప్పారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగి మాల్ట్ అందిస్తున్న సంగతి గుర్తు చేశారు. కొర్రలు, ఆండు కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, రాగులు వంటి చిరు ధాన్యాలు రక్త హీనత నివారణలో సైతం మంచి ఆహారంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పూర్వ కాలంలో ప్రధాన ఆహారంగా ఉండేదని, మధుమేహం, రక్త పోటు వంటి వ్యాధులకు దూరంగా ఉండే వారని ఆయన అన్నారు. చిరు ధాన్యాలకు మల్లాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అభప్రాయపడ్డారు. 


     చిరు ధాన్యాల వినియోగం ప్రోత్సహించుటకు, గిరిజనులు పండించే పంటలకు విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి జిల్లా సమాఖ్య ద్వారా విక్రయిస్తున్నట్లు  డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు.  మిల్లెట్ స్టాల్స్ అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేస్తామని, మహిళా మార్ట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments