అర్జీదారుల స‌మ‌స్యల ప‌రిష్కారంపై మ‌రింత చిత్త‌శుద్ధి చూపాలి.



 


#అర్జీదారుల స‌మ‌స్యల ప‌రిష్కారంపై మ‌రింత చిత్త‌శుద్ధి చూపాలి



#ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో జిల్లాకు మంచిపేరు తేవాలి


#జ‌గ‌న‌న్నకు చెబుదాం కార్య‌క్ర‌మానికి అంతా సిద్ధంకావాలి


# స‌మీక్ష స‌మావేశంలో అధికారుల‌కు సూచించిన మంత్రి బొత్స‌


 


విజ‌య‌న‌గ‌రం, మే 08 (ప్రజా అమరావతి):


వివిధ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు అందించే విన‌తుల ప‌రిష్కారంపై చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించాల్సి వుంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా విన‌తుల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతున్నార‌ని దీనిలో భాగంగా జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌ని అందువ‌ల్ల అధికారులు మరింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి వుంద‌న్నారు. జిల్లాలో ఎలాంటి ప్ర‌జాస‌మ‌స్య వున్నా అధికారులు వెంట‌నే స్పందించి వాటికి త‌గిన ప‌రిష్కారం ఆలోచించాల‌న్నారు. జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మం, తుఫానుపై ముంద‌స్తు అప్ర‌మ‌త్త‌త కోసం జిల్లా అధికారుల‌తో మంత్రి సోమ‌వారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, పంట‌నష్టంపై ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌త్యేక అధికారి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి చిరంజీవి చౌద‌రి, జిల్లా ప్ర‌త్యేక అధికారి, పాఠ‌శాల విద్య క‌మిష‌న‌ర్ సురేష్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్ త‌దిత‌రుల‌తో క‌ల‌సి విద్యాశాఖ మంత్రి సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల ప‌రిష్కారాన్ని నేరుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తుంద‌ని, అందువ‌ల్ల ప్ర‌తి విన‌తిని శ్ర‌ద్ధ‌తో ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. విన‌తుల ప‌రిష్కారంలో రాష్ట్రానికే మార్గం చూపే విధంగా జిల్లా యంత్రంగం ప‌నిచేయాల‌ని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యంగా స‌చివాల‌య ఉద్యోగుల ప‌నితీరుపై ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, వారంతా కొత్త‌గా ఉద్యోగంలో చేరినందున వారికి త‌గిన కౌన్సిలింగ్ చేసి ప‌నితీరు మెరుగుప‌ర‌చుకొనేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు అధికారుల‌కు ప‌లు స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు ఫోన్ చేసిన‌పుడు స్పందించాల‌ని మంత్రి ఆదేశించారు.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌మ్యూనికేష‌న్ సంబంధాలు పెరిగినందున ఫోన్ ద్వారానే ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంద‌న్నారు.


 


జిల్లాలో విన‌తుల ప‌రిష్కారంలో జాప్యం లేన‌ప్ప‌టికీ అర్జీదారుల్లో సంతృప్తి క‌లిగించే స్థాయిలో అధిక సంఖ్యలో విన‌తులు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని దీనిపై అధికారులు దృష్టి సారించాల‌ని జిల్లా ప్ర‌త్యేక అధికారి సురేష్ కుమార్ సూచించారు. ఏదైనా  విన‌తి అందిన‌పుడు ఆయా విన‌తిని ఎలా ప‌రిష్క‌రించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను సంతృప్తి క‌లిగించ‌వ‌చ్చ‌నే అంశంపై మండ‌ల‌, గ్రామ‌స్థాయి అధికారులు, సిబ్బందిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. గ‌త రెండు మూడేళ్ల‌లో అందిన విన‌తుల‌ను ఆడిటింగ్ చేసి శాఖ‌ల వారీగా, అంశాల వారీగా విశ్లేషించిన‌పుడు ప‌లు అంశాల్లో అత్య‌ధికంగా విన‌తులు వ‌చ్చాయ‌ని, ఆయా అంశాల‌పై శ్ర‌ద్ద చూపాల‌న్నారు. అధికారులు ప్ర‌తి అర్జీని నాణ్య‌త‌గా, సంతృప్తిక‌ర స్థాయిలో ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి సారించాల‌న్నారు.


 


జిల్లాలో పంట‌న‌ష్టం లేదు : మంత్రి బొత్స‌


ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల కార‌ణంగా జిల్లాలో వ్య‌వ‌సాయ‌, ఉద్యాన పంట‌ల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. క్షేత్ర‌స్థాయి నుంచి వ్య‌వ‌సాయ‌, ఉద్యాన అధికారుల‌తో పంట‌న‌ష్టంపై నివేదిక‌లు అందిన మీద‌ట ఈ విష‌యం చెబుతున్న‌ట్టు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి చెరువుల‌కు కూడా ఎలాంటి న‌ష్టాలు జ‌ర‌గ‌లేద‌న్నారు. వ‌చ్చే రెండు మూడు రోజుల్లో తుఫాను ప్ర‌భావం వుండొచ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసినందున అధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని మంత్రి సూచించారు. ఈ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డి.ఆర్‌.ఓ. గ‌ణ‌ప‌తిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


 



Comments