పొదలకూరు మండలంలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు


నెల్లూరు, మే 17 (ప్రజా అమరావతి):  పొదలకూరు మండలంలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు


చేపట్టినట్లు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


బుధవారం సాయంత్రం పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామపంచాయతీ పరిధిలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. అనంతరం 5.75 కోట్ల రూపాయలతో పునః నిర్మించిన రాపూరు రహదారిని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పొదలకూరు మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 30 గ్రామ పంచాయతీల్లోని 23 సచివాలయాల పరిధిలో దిగ్విజయంగా ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే పొదలకూరు మండలంలో ఎప్పటినుంచో పరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి, గ్రామాల వారీగా అనుభవదారుల జాబితా సేకరించి, జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. 

 ఇనుకుర్తి, ముదిగేడు గ్రామాల్లో సుమారు ఐదు కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంకా ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను చేపడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. 


 ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో నగేష్ కుమారి, తాసిల్దార్ ప్రసాద్,  స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Comments