*- గుడ్లవల్లేరు బ్రిడ్జికి హాని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి*
*- హైవే రూల్స్ కు విరుద్ధంగా పోలియార్డ్స్ బోర్డులు*
*- పెనుగాలులు వస్తే రెయిలింగ్ కూలే ప్రమాదం ఉంది*
*- బ్రిడ్జిపై ప్రయాణించే వాహనాలపైనా పడొచ్చని ఆందోళన*
*- అధికారులకు బోర్డులు కనిపించకపోవడం దురదృష్టకరం*
*- నేషనల్ హైవేస్ అధికారులకు మురళీకృష్ణ ఫిర్యాదు*
గుడివాడ, మే 25 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరులో వున్న "వై బ్రిడ్జి"పై హైవే రూల్స్ కు విరుద్ధంగా పోలియార్డ్స్ బోర్డులను ఏర్పాటు చేశారని, బ్రిడ్జికి హాని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు వైవి మురళీకృష్ణ కోరారు. గురువారం నేషనల్ హైవేస్ డిఈఈకి అయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఎంఎన్కె హైవేపై ఉన్న గుడ్లవల్లేరు బ్రిడ్జి రెయిలింగ్ కు గుడివాడ పట్టణానికి చెందిన జీవి మాల్ సంస్థ పోలియార్డ్స్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది హైవే రూల్స్ కు పూర్తి విరుద్ధమని తెలిపారు. పెనుగాలులు వచ్చినప్పుడు ఈ పోలియార్డ్స్ బోర్డులు అన్నీ ఒకేసారి ఊగుతూ ఉంటాయని, దీనివల్ల బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కోసారి బలంగా వీచే గాలులకు బోర్డులు ఎగిరి బ్రిడ్జిపై ప్రయాణించే ప్రజలు, వాహనదారులపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. పోలియార్డ్స్ బోర్డులను తొలగించాలని ఫోన్ ద్వారా అనేకసార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు.
అయినప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో రాతపూర్వకంగా నేషనల్ హైవేస్ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. విధుల్లో భాగంగా నేషనల్ హైవేస్ అధికారులు హైవేలను తనిఖీలు చేస్తుంటారని అన్నారు. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు బ్రిడ్జిపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన పోలియార్డ్స్ బోర్డులు కనపడకపోవడం దురదృష్టకరమన్నారు. వేసవిలో గాలి వానలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల బ్రిడ్జి రెయిలింగ్ విరిగిపోయినా, ఆ బోర్డుల వల్ల వాహనదారులకు, ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని భవిష్యత్ భద్రతాదళం అధ్యక్షుడు మురళీకృష్ణ హెచ్చరించారు.
addComments
Post a Comment