దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత.దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత- దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యం


- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి


- 18 మంది విభిన్న ప్రతిభావంతులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు పంపిణీ 


నెల్లూరు, మే 30 (ప్రజా అమరావతి): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


 మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 మంది వికలాంగులకు 18 లక్షలు విలువచేసే మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్ తో కలిసి   మంత్రి పంపిణీ చేశారు. 


 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, వారికి దైనందిక జీవితంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మోటారు వాహనాలను అందిస్తుందని, ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వికలాంగులకు సంబంధించి ఎక్కడా వివక్ష లేకుండా, పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, గతంలో మాదిరిగా వైకల్య శాతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రూ. 3000  పింఛన్ అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వికలాంగుల పట్ల సమాజం, ప్రభుత్వం సానుభూతి చూపాలని, వారికి అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. 


తొలుత విభిన్న ప్రతిభావంతులతో మంత్రి మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  విభిన్న ప్రతిభావంతులు అందరూ తమ రోజు వారి కార్యక్రమాలను సులభతరం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ మోటార్ వాహనాలను   సద్వినియోగం చేసుకుని, జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని మంత్రి వారికి సూచించారు. 

 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి అక్బర్ అలీ, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. 


Comments