వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలి.



విజయవాడ (ప్రజా అమరావతి);

వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలి


సూప‌రింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్ల మ‌ధ్య సమన్వయంతో  సత్ఫలితాలు 

ప్రభుత్వ ఆశ‌యాలు నెర‌వేర్చడంలో వైద్యుల పాత్ర చాలా కీల‌కం

రోగుల సంతృప్తిని అంచనా వేసి వైద్య సేవలను మెరుగు పరచాలి

వైద్య ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 

ఆస్పత్రుల్లో మంజూరు అయిన ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు

మధ్యాహ్నం 2 గం.ల వరకు ఓపీ..సాయంత్రం 4 గం.ల వరకు డాక్టర్ అందుబాటులో ఉండాలి

ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు

- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు

బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల పరిపాలనా విభాగానికి చెందిన అధికారులకు విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్ లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం ముగింపు కార్యక్రమానికి ఎం.టి.కృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమన్వయంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో బయోమెట్రిక్ హాజరును దుర్వినియోగం కాకుండా చూడాలని..ప్రతి ఉద్యోగీ నిర్ణీత సమయానికి ఆస్పత్రిలో ఉండాలని సూచించారు. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు తరచూ ఆస్పత్రులను తనిఖీ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ సర్వీసులో చేరిన ప్రతిఒక్కరూ పద్ధతి ప్రకారం సమయ పాలన పాటించాలన్నారు. ఆస్పత్రులకు కావాల్సిన నిధులు, మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. వైద్య ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. డ్రగ్ స్టోర్ లో మందులు, సర్జికల్ ఐటమ్స్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని..సర్జికల్స్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వాస్పత్రుల ప్రతిష్టను పెంచేలా వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ వంటి ఆస్పత్రి నిర్వహణ పనులను పర్యవేక్షించేందుకు విశ్రాంత అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదన చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరెక్టర్లు బాధ్యతగా వాటి అమలును పర్యవేక్షించాలన్నారు. వైద్య సిబ్బంది నియామకాలు, వైద్య సేవలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా ఉండేలా సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, సమస్యలను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

48వేలకు పైగా వైద్యసిబ్బంది నియామకం:

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 48 వేల మందికిపైగా వైద్య సిబ్బందిని నియమించిందని..ఆస్పత్రుల్లో శాంక్షన్ అయిన ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నా, చెడ్డపేరు రావాలన్నా ప్రభుత్వ వైద్యసిబ్బంది చేతుల్లోనే ఉంటుందన్నారు. ఒకరి చేసే తప్పు వ్యవస్థలో అందరి మీద ప్రభావం చూపిస్తుందన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జీతభత్యాల కోసం ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తోందని..అందుకు తగినట్లుగా పనిచేస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. రోగులతో ఆస్పత్రిలో ప్రతి సెక్షన్ సిబ్బంది ఎలా మసులుకుంటున్నారో అన్నది కూడా చాలా ముఖ్యమన్నారు. ప్రస్తుతానికి చాలా ప్రభుత్వాస్పత్రుల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ రాస్తున్నారని దానిని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించాలని..అలాగే వైద్యులు కూడా సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రోగుల సంతృప్తిని అంచనా వేసి వైద్య సేవలను మెరుగు పరచాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆస్పత్రుల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేయాలన్నారు. ఉదయం ఓపీకి వచ్చినవారు పరీక్షలు చేయించుకుని ఆయా టెస్టుల అయ్యాక వాటిని మళ్లీ డాక్టర్ కు చూపించి తగిన మందులు తీసుకునే వెళ్లే పరిస్థితులు ఉండాలన్నారు. వైద్య సిబ్బందికి స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఇందుకోసం సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేటర్స్ చురుగ్గా పనిచేయాలన్నారు. ప్రభుత్వ సేవలో భాగంగా ప్రతి పేదవాడికి వైద్యం చేయడానికే ఈ వృత్తిలోకి వచ్చానన్న భావన ప్రతి వైద్యుడిలో ఉండాలన్నారు. సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రతిరోజూ సమావేశమై సేవలు, సమస్యలపై చర్చించి ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించేలా చూడాలన్నారు. 

ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధుల విడుదల:

ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా త్వరితగతిన ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులను క్లియర్ చేస్తున్నామన్నారు. సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు కూడా పెండింగ్ బిల్లులపై బాధ్యతగా ఉండాలని, అసలు ఎన్ని బిల్లులు చేస్తున్నామో, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఆగుతున్నాయో అన్న అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో పారా మెడికల్ సిబ్బంది నియామకం జరిగేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పనుల విషయంలో ప్రతిపాదనల మేరకు పెద్ద ఇనిస్టిట్యూషన్లకు రూ.3 కోట్లు, చిన్న ఇనిస్టిట్యూషన్లకు రూ.2 కోట్లు తక్షణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కింది స్థాయి నుంచి హెల్త్ కేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేస్తోందని, ఇందులోభాగంగా విలేజ్ హెల్త్ కేర్ నుంచి టెర్షియ‌రీ కేర్ వరకు పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేశారన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ క‌ళాశాల‌లు నిర్మిస్తున్నార‌ని వీటిలో 5 మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి త‌ర‌గ‌తులు కూడా ప్రారంభం కాబోతున్నాయ‌న్నారు. క్యాన్సర్ బాధితులకు సైతం రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎం.టి.కృష్ణబాబు అన్నారు.  

 

ఈ కార్యక్రమంలో డీఎంఈ విభాగ ముఖ్య అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్లు, డిప్యూటీ సూప‌రింటెండెంట్లు, సీఎస్ ఆర్ ఎంవోలు, ఏడీలు, అడ్మినిస్ట్రేట‌ర్లు, వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, ఏడీలు పాల్గొన్నారు.

Comments