ఆదర్శ గ్రామంగా తోడేరు - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి


 

ఆదర్శ గ్రామంగా తోడేరు

- మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

స్వగ్రామం తోడేరులో మంత్రికి అభిమాన నీరాజనం

- తమ ఇంటి బిడ్డలా ఎదురేగి ఘన స్వాగతం పలికిన ప్రజలు

- ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించిన మంత్రి


 స్వగ్రామం తోడేరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కాకాణికి ప్రజలు జననీరాజనాలు పలికారు. తమ గడప తొక్కిన తమ గ్రామ బిడ్డకు ఎదురేగి ఘన స్వాగతాలు పలికారు. గ్రామంలో ఏ ఒక్కరిని మరిచిపోని మంత్రి కాకాణి,  ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ, వారితో ముచ్చటిస్తూ.. వారి యోగక్షేమాలు  తెలుసుకున్న తీరు గ్రామ ప్రజలపై ఆయనకున్న అభిమానం, ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచింది.  


నెల్లూరు, మే 7 (ప్రజా అమరావతి)


:  ఆదర్శ గ్రామంగా తోడేరు గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం  పొదలకూరు మండలంలోని తన స్వగ్రామమైన తోడేరులో  గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా  పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  


 గ్రామంలోని  గిరిజన కాలనీలో గడపగడపకు వెళ్లిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని తెలుసుకుని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రతి గడపలోనూ మంత్రికి ప్రజలు ఎదురేగి ఘన స్వాగతం పలికగా, మంత్రి కూడా ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి, వారితో మమేకమయ్యారు. 


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తమ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేశామని, అయినా ప్రతి ఒక్కరిని పలకరించాలి, వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో గడపగడపకు మన కార్యక్రమాన్ని గ్రామంలో చేపట్టినట్లు చెప్పారు. స్వగ్రామమైన తోడేరు అభివృద్ధిపై తమ తండ్రి ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన స్ఫూర్తితో జిల్లా పరిషత్ చైర్మన్ గా తన కనీస బాధ్యతగా గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేశానని చెప్పారు. గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడి భవనం, మసీదు, రామాలయం, జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, స్మశాన వాటికలు, తాగునీటి సౌకర్యం ఇలా అన్ని వసతులు సంపూర్ణంగా సమకూర్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే గ్రామానికి  నిరంతరం విద్యుత్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం రూ. 2.60 కోట్లతో 33 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించామని చెప్పారు. గ్రామస్తుల సహాయ సహకారాలు, అండదండలతో మంత్రి స్థాయికి తాను ఎదిగానని, ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధికి పనిచేయడం తన బాధ్యతగా ఆయన చెప్పారు. గ్రామంలోని గిరిజనులకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రభుత్వ సాయంతోపాటు, తన సొంత నిధులు వెచ్చించి గిరిజనులకు ఇళ్లను నిర్మించి ఇస్తానని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలిచిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments