*ప్రజల ఆర్థిక భద్రతే లక్ష్యం
*
పార్వతీపురం, మే 29 (ప్రజా అమరావతి): ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించాలన్నదే లక్ష్యంగా సంక్షేమ, భీమా పథకాలను అమలు చేస్తున్నాయని కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి సోమవారం పర్యటించారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని వివిధ శాఖల బ్యాంక్ ఖాతాదారుల తో ముఖాముఖి మాట్లాడారు. బ్యాంక్ అధికారులు ఖాతాదారులతో మమేకమై సేవలు అందిస్తున్నారా, లేక ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. దీనిలో భాగంగా పలు సంక్షేమ పథకాలను, ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం క్రింద తక్కువ ప్రీమియం చెల్లించి బీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు అయినందున ఖాతాదారుల సౌలభ్యం దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఏ టి ఎమ్ సేవలు విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక అక్షరాస్యత పెరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాల పై అవగాహన పెంపొందించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ స్థాయి నుండి అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాల ప్రయోజనం కల్పించేలా బ్యాంక్ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథాకాలను పారదర్శక పద్దతిలో అందజేస్తున్నామన్నారు. ప్రజలు పథకాల ప్రయోజనం పొందేందుకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు.
అనంతరం బీమా చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.బి.ఐ డెప్యూటీ జనరల్ మేనేజర్లు ఏ.వెంకట్రామయ్య, పంకజ్ కుమార్, ఎస్.ఎల్.బి.సి ఎజీఎం ఇ. రాజ బాబు, నాబార్డు ఎజీఎం టి.నాగార్జున, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.ఎల్.ఎన్.మూర్తి, జట్టు వ్యవస్థాపకులు డా.పారి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment