ఎన్టీఆర్ వారసులెవరూ కొడాలి నానిని పట్టించుకోరు.

 *- ఎన్టీఆర్ వారసులెవరూ కొడాలి నానిని పట్టించుకోరు


 *- కొడాలి నాని పెళ్ళికి హరికృష్ణ ఎందుకు రాలేదు* 

 *- జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎప్పుడో తరిమేశారు*

 *- ఆయనను ఎంతగా మోసం చేసావో చెప్పమంటావా* 

 *- సాన్నిహిత్యం ఉండి ఉంటే ఒక్క ఫొటో దిగి చూపించగలవా* 

 *- అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు భక్తుడివని ఒప్పుకుంటాం*

 *- గుడివాడ నియోజకవర్గం దయనీయ స్థితిలో ఉంది* 

 *- ఆర్టీసీ బస్టాండ్, అద్వానంగా ఉన్న రోడ్ల గురించి మాట్లాడు*

 *- టీడీపీ అంతర్గత వ్యవహారాల సంగతి నీకెందుకు* 

 *- ముందు వైసీపీలో ఏం జరుగుతుందో చూసుకో* 

 *- కొడాలి నానికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వెనిగండ్ల* గుడివాడ, మే 30 (ప్రజా అమరావతి): ఎంతో అభిమానం ఉందని చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎన్టీఆర్ వారసులెవరూ పట్టించుకోరని తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో వెనిగండ్ల ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వెనిగండ్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ఎమ్మెల్యే కొడాలి నానికి ఎందుకని ప్రశ్నించారు. ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అకస్మాత్తుగా ఎక్కడికెళ్ళిపోయారని ప్రశ్నించారు. కొడాలి నానిని మంచి వ్యక్తి అని చెప్పేవారు ఎన్టీఆర్ వారసుల్లో ఒక్కరు కూడా లేరన్నారు. పదేపదే ఎన్టీఆర్ వారసులంటూ జపం చేసే కొడాలి నానిని ఆ వారసుల్లో ఎవరు రానిస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద భక్తుడినని చెప్పుకునే కొడాలి నాని పెళ్ళికి హరికృష్ణ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. తన పెళ్ళికి హరికృష్ణ వచ్చినట్టుగా ఒక్క ఫొటో ఉంటే చూపించాలన్నారు. ఇష్టమైన వారు పిలిచే ఏ కార్యక్రమానికైనా హరికృష్ణ తప్పనిసరిగా హాజరవుతుంటారన్నారు. అలా కార్యకర్త పెళ్ళికి వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురై దురదృష్టవశాత్తూ హరికృష్ణ మరణించారని గుర్తుచేశారు. అలాంటి గొప్ప మనస్సున్న హరికృష్ణ కొడాలి నాని పెళ్ళికి ఎందుకు రాలేదో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఎంతో సన్నిహితుడిని, స్నేహితుడిని, భక్తుడినని కొడాలి నాని చెప్పుకుంటాడన్నారు. కొడాలి నానిని రానిచ్చి ఎంతో కాలమైందని, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో తరిమేశారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగా మోసం చేశావో చెప్పమంటావా అంటూ కొడాలి నానిని నిలదీశారు. కొడాలి నాని పనికిమాలిన మాటలన్నీ వృథా ప్రయాసేనని, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడడం, దానికి తాను కౌంటర్ ఇవ్వడం ఇదంతా అవసరం లేదన్నారు. గుడివాడ నియోజకవర్గం ఎంతో దయనీయ స్థితిలో ఉందని, ముందు ఇక్కడ అభివృద్ధి, ప్రజల స్థితిగతులపై మాట్లాడాలన్నారు. అలా కాకుండా ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ గురించే మాట్లాడుతూ ఉంటాడని, అంత దగ్గర సంబంధాలు ఉండి ఉంటే ఇప్పుడైనా ఆయనతో ఒక్క ఫొటో దిగి చూపించాలని, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఉందని, భక్తుడివని  అందరం ఒప్పుకుంటామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను డబ్బు, ల్యాండ్ వ్యవహారాల్లో కొడాలి నాని చేసిన మోసాలను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకొస్తాయన్నారు. ఇప్పటికైనా పనికిమాలిన సోది ఆపేసి ముందు తన సంగతి చూసుకోవాలని హితవు పలికారు. అలాగే గుడివాడ ఆర్టీసీ బస్టాండ్, అద్వానంగా మారిన రోడ్ల దుస్థితిని కూడా చూడాలని ఎమ్మెల్యే కొడాలి నానికి వెనిగండ్ల సూచించారు.

Comments