*రూ.195 కోట్లతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ది పనులు
*
*•రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాలయ అభివృద్ది పనులకు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్*
*•మరో రూ.125 కోట్ల దేవాలయ నిధులతో మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ది పనులు*
*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*
అమరావతి, జూన్ 27 (ప్రజా అమరావతి): విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనులను రూ.195 కోట్లతో నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇందులో ప్రభుత్వ నిధులు రూ.70 కోట్లు కాగా మిగిలిన రూ.125 కోట్లు దేవాలయ నిధులని ఆయన తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ ప్రతి వారం మాదిరిగానే నేడు కూడా ధర్మాదాయ, దేవాదాయ శాఖపరంగా సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కొట్టుసత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాలయంలో అభివృద్ది పనులకై భారీ స్థాయిలో రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులను ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిధులను దేవాదాయ, ధర్మాదాయ శాఖకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ నిధుల్లో ఇప్పటికే మొత్తం రూ.14.70 కోట్లు మేర పలు పనులను పూర్తి చేయడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న దాదాపు రూ.55 కోట్లతో ప్రసాదం పోటు, అన్నదానం భవనాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండు భవనాల నిర్మాణాలకు ఇప్పటికే పరిపాలనా, సాంకేతిక అనుమతులను మంజూరు చేయడమైనదని, అయితే ప్రసాదం పోటు భవన నిర్మాణానికి ఈ వారంలోను, అన్నదాన భవనానికి జూలై రెండవ వారంలోనూ టెండర్లను పిలవనున్నట్లు ఆయన తెలిపారు . ఇప్పటికే వెచ్చించిన రూ.14.70 కోట్లతో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం అభివృద్ది పనులు, ప్రాకార మండపం ఆధునీకరణ పనులు, కొండ రాళ్లు దొర్లి భక్తులపై పడకుండా మిటిగేషన్ పనులు మరియు స్కాడా పనులను పూర్తి చేయడమైందని తెలిపారు. అదే విధంగా మరో రూ.125 కోట్ల దేవాలయ నిధులతో మల్టీ లెవిల్ క్యూ కాంప్లెక్సు, క్యూ కాంప్లెక్సు నుండి అన్నదాన భవనానికి వెళ్లేందుకు బ్రిడ్జి తదితర నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో యాగశాల నిర్మాణానికి నిర్థేశించిన స్థలం వెనుక భాగంలో అమ్మవారి కుంకుమ పూజల నిర్వహణకై రూ.6.00 కోట్లతో రెండు అంతస్తుల పూజా మండపాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టమైందని, అందుకు సంబందించిన టెండర్లను జూలై రెండో వారంలో పిలువనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉందన్నారు. అదే విధంగా దుర్గా నగర్ ప్రవేశ మార్గం ప్రక్కన బి.ఓ.టి. విధానంపై రూ.60 కోట్ల అంచనా వ్యయంతో మెకనైజ్డు మల్లీలెవిల్ కార్ పార్కింగ్ నిర్మాణానికి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టును పిలుస్తునట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి సంబందించి రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్సు, రూ.35 కోట్లతో సాల మండపాలు మరియు కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రూ.3.60 కోట్లతో అన్నధాన భవనము, రూ.4.00 కోట్లతో క్యూకాంప్లెక్సు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి.లు నివాసం ఉండే ప్రాంతాల్లో ధర్మప్రచారం చేయాలని, దేవాలయాలు నిర్మించాలనే ఉత్తమ ఆలోచనతో శ్రీవాణి ట్రస్టు నిధులతో 1,917 ఆలయాలను మంజూరు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో ఇప్పటికే 180 దేవాలయాలను శాఖా పరంగా పూర్తి చేయడం అయిందని, 825 దేవాలయాలు ప్రగతిలో నున్నాయని మిగిలిన 912 పునాధి స్థాయిలో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ ఈ ఏడాది నవంబరు మాసాంతానికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.
అదే విదంగా ఆలయాల్లో ఎటు వంటి అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన ఎక్కౌంటింగ్ విధానాన్ని అమల్లోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ బాద్యతా యుతంగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఒక్క ఇ.ఓ. మినహా మిగిలిన ఉద్యోగులు అందరినీ మూడు మాసాలకు ఒక సారి రొటేషన్ విదానంలో స్థాన చలనం చేసే విధంగా నిబందనలను విధించడమైందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఆలయాల్లో బంగారు ఆభరణాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మూడు జోన్లలో కూడా బంగారు ఆబరణాల తనిఖీ అధికారులు ఉన్నారని, వారు ప్రతి మూడేళ్లకు ఒక సారి దేవాలయాల్లోని ఆభరణాలను తనిఖీ చేసి వాటి వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
మ్యాచింగ్ గ్రాంట్ నిధులతో రాష్ట్రంలో నూతన దేవాలయాల నిర్మాణానికి మరియు పాత దేవాలయాల పునరుద్దరణకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రూ.450 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే తన హయాంలో దాదాపు రూ.270 కోట్లు విడుదల చేయడమైందన్నారు.
addComments
Post a Comment