2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.

 *- 2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం*


 

 *- వెనిగండ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ ఫోకస్* 

 *- గుడివాడ పర్యటన తర్వాత పెరిగిన ఫుల్ కాన్ఫిడెన్స్* 

 *- సేవా, పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోనే వెనిగండ్ల*

 *- లోకేష్ ను యువగళంలో తరచూ కలుస్తున్న వెనిగండ్ల* 

 *- ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించే వ్యూహాలకు పదును* 

 *- గుడివాడలో స్పీడందుకున్న వెనిగండ్ల రాజకీయం* 



గుడివాడ, జూన్ 6 (ప్రజా అమరావతి): 2024 ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. గుడివాడలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి పదవిని కూడా చేపట్టిన కొడాలి నానిని వెనిగండ్ల ఢీ కొట్టగలడన్న అంచనాకు వచ్చిన చంద్రబాబు ఆయనపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి గుడివాడ పర్యటన తర్వాత వెనిగండ్లపై చంద్రబాబుకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టుగా అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల తన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై కూడా చంద్రబాబు సంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వస్తున్న వెనిగండ్లకు నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక బలమైన వర్గం అండగా నిలుస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు గుడివాడ పర్యటన తర్వాత నారా లోకేష్ ను కూడా కలవడం జరిగింది. కర్నూలు జిల్లాలో జరిగిన పాదయాత్రలో గుడివాడ నియోజకవర్గం నుండి దాదాపు 100 మంది కార్యకర్తలతో కలిసి వెనిగండ్ల పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ లను తరచూ కలుస్తూ గుడివాడ నియోజకవర్గ పరిస్థితులను వెనిగండ్ల వివరిస్తూ వస్తున్నారు. నారా లోకేష్ ను కలిసొచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాజకీయం స్పీడందుకుంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా అన్ని అస్త్రాలతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. గుడివాడ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజల కోసం విస్తృతంగా సేవా, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఎంతగానో చేరువైపోయారు, నారా లోకేష్ స్పూర్తితో యువత బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 2వేల మంది నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణతో ప్రతిరోజూ గుడివాడలో నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. ఉచిత వైద్యశిబిరాల ఏర్పాటుతో పేదలకు వైద్యసేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సొంత ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన ఆర్వో ప్లాంట్ మంచినీటిని సరఫరా చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సేవాకార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న వెనిగండ్లకు సాదర స్వాగతం లభిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న విమర్శలను వెనిగండ్ల సీరియస్ గా తీసుకుంటూ తనదైన శైలిలో ధీటుగా సమాధానాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై టీడీపీలో చర్చ జరుగుతుండగా, వెనిగండ్లకు మాత్రం చంద్రబాబు దగ్గర మార్పులే పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Comments