రూ. 8వేల కోట్ల‌తో వైద్య క‌ళాశాలల‌ నిర్మాణం.



రూ. 8వేల కోట్ల‌తో వైద్య క‌ళాశాలల‌ నిర్మాణం

తొలివిడ‌త విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల

అందుబాటులోకి రానున్న 750 ఎంబిబిఎస్ సీట్లు

ఒక్కో కాలేజీ రూ.500 కోట్ల‌తో నిర్మాణం

వైద్యారోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు

విజ‌య‌న‌గ‌రం వైద్య‌క‌ళాశాల నిర్మాణ ప‌నులు త‌నిఖీ


విజ‌య‌న‌గ‌రం, జూన్ 09 (ప్రజా అమరావతి) ః

                ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న వైద్య క‌ళాశాల‌ల్లో అన్ని ర‌కాల‌ ఆధునిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు చెప్పారు.  రాష్ట్రంలో సుమారు రూ.8వేల కోట్ల‌తో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌ను ద‌శ‌ల‌వారీగా ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిపారు. తొలివిడ‌తగా నిర్మిస్తున్న విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల వైద్య క‌ళాశాల‌ల‌ను వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రంనుంచే ప్రారంభిస్తామ‌ని తెలిపారు. నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ ఆదేశాల‌కు అనుగుణంగా జులై 15 నాటికే ఈ క‌ళాశాల త‌ర‌గ‌తి గ‌దుల‌ నిర్మాణ‌ ప‌నులను పూర్తి చేసి, ఆగ‌స్టు నాటికి విద్యార్థుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఎపిఎంఎస్ఐడిసి ఎండి ముర‌ళీధ‌ర‌రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి, విజ‌య‌న‌గ‌రం గాజుల‌రేగ వ‌ద్ద నిర్మిత‌మ‌వుతున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ప‌నుల‌ను ఆయన శుక్ర‌వారం త‌నిఖీ చేశారు.

               ఈ సంద‌ర్భంగా కృష్ణ‌బాబు మీడియాతో మాట్లాడుతూ, వైద్యారోగ్య రంగంలో అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిచేందుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని చెప్పారు. ప్ర‌తీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ఉండాల‌న్న‌ది ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మ‌ని చెప్పారు. దీనిలో భాగంగా తొలివిడ‌త ఐదు క‌ళాశాల‌ల‌ను వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచే ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. వీటిలో నాలుగు క‌ళాశాల‌ల‌కు ఇప్ప‌టికే అనుమ‌తి ల‌భించింద‌ని, రాజ‌మండ్రి వైద్య క‌ళాశాల‌కు మాత్రం కొద్ది రోజుల్లో అనుమ‌తులు  రానున్నాయ‌ని తెలిపారు. పాడేరు, పులివెందుల‌, ఆదోని వైద్య క‌ళాశాల‌లు 2024-25 విద్యాసంవ‌త్స‌రంలో, మరో 9 వైద్య ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు 2025-26లో ప్రారంభం కానున్నాయ‌ని తెలిపారు. ప్ర‌తీ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల వ‌స‌తుల‌తోపాటుగా, ల‌క్షా, 20వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంగ‌ల భ‌వ‌న స‌ముదాయం, 330 ప‌డ‌క‌ల‌తో నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆసుప‌త్రి కావాల‌న్నారు. కొత్తగా ప్రారంభం కానున్న ఐదు వైద్య క‌ళాశాల‌ల వ‌ల్ల రాష్ట్రంలో అద‌నంగా 750 ఎంబిబిఎస్ సీట్లు  అందుబాటులోకి రానున్నాయ‌ని చెప్పారు. సుమారు రూ.500 కోట్ల‌తో నిర్మిత‌మ‌వుతున్న ఒక్కో వైద్య క‌ళాశాల‌లో మొత్తం 722 మంది ఉద్యోగులను నియ‌మిస్తామ‌ని, వీరే కాకుండా మ‌రో 280 అద‌న‌పు సిబ్బందిని నియ‌మించేందుకు ప్ర‌తిపాద‌న‌లను ప్ర‌భుత్వానికి పంపించామ‌ని తెలిపారు.  


*నిర్మాణ ప‌నుల ప‌రిశీల‌న‌*

               విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల త‌ర‌గ‌తి గ‌దులు, హాస్ట‌ల్ భ‌వ‌నం నిర్మాణ ప‌నుల‌ను ఎం.టి.కృష్ణ‌బాబు క్షుణ్ణంగా ప‌రిశీలించి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. క‌ళాశాల‌ను ప్రారంభించే నాటికి అన్ని వ‌స‌తుల‌ను పూర్తిగా క‌ల్పించాల‌ని ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దుల్లో స్మార్ట్ టీచింగ్ విధానాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌కుండా, రెండు చోట్ల నుంచి విద్యుత్‌ను తీసుకోవాల‌ని సూచించారు. నీటి వ‌స‌తి కోసం రూ.10కోట్ల‌తో ప్ర‌తిపాదించిన ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించాల‌న్నారు. బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల ప‌రిక‌రాలు, ఫ‌ర్నీచ‌ర్‌, ఇత‌ర సామ‌గ్రి అంతా ప్రారంభం నాటికే సిద్దం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.  అందుబాటులో ఉన్న అత్యుత్త‌మ బోధ‌నా ప‌ద్ద‌తుల‌ను ఈ క‌ళాశాల‌లో ఏర్పాటు చేయాల‌ని, దీనికోసం నిపుణుల బృందం ఇత‌ర వైద్య క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి నివేదిక త‌యారు చేయాల‌ని సూచించారు. విద్యుత్, ఫాల్స్ సీలింగ్‌, ప్లంబింగ్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, దీనికి అవ‌స‌ర‌మైన నిపుణుల సంఖ్య‌ను పెంచాల‌ని ఆదేశించారు. అన్ని స‌దుపాయాల‌తో హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని నిర్మించి, లిఫ్ట్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని సూచించారు.


              ఈ త‌నిఖీలో ఎపిఎంఎస్ఐడిసి ఎండి ముర‌ళీధ‌ర‌రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, డిఎంఈ వ‌ర‌ప్ర‌సాద్‌, ఎపిఎంఎస్ఐడిసి ఎస్ఈ అంక‌మ్మ చౌద‌రి, ఇఇ బిఎన్ ప్ర‌సాద్‌, వైద్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ప‌ద్మ‌లీల‌, సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ అప్ప‌ల‌నాయుడు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ భాస్క‌ర‌రావు,  ఇన్‌ఛార్జి మున్సిప‌ల్ కమిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments