ప్రభుత్వ తప్పుడు కేసులు, వైసీపీ దాడులను ఎదిరించి నిలబడ్డ క్యాడర్ కి వందనం
ప్రజల ఆమోదం, కార్యకర్తల మద్దతు ఉన్నవారికే పదవులు:- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
కుప్పం (ప్రజా అమరావతి):- కుప్పం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలు,ప్రతిపక్ష పార్టీగా రానున్న రోజుల్లో చేయాల్సిన పోరాటాలపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ముందుగా 4 మండలాలకు చెందిన కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు...అనంతరం కుప్పం మునిసిపాలిటీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత అంశాలపై చర్చించారు. పలువురు నేతలు తమ అభిప్రాయాలు, అనుభవాలను సమావేశంలో పంచుకున్నారు. కుప్పంలో 4 ఏళ్లుగా అభివృద్ది పనులు నిలిచిపోయిన విషయాలను వివరించారు. 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలను ప్రస్తావించారు. ప్రభుత్వ తప్పుడు కేసులు, వైసీపీ గూండాల దాడులను ఎదిరించి నిలబడ్డ క్యాడర్ కు వందనాలు తెలుపుతున్నాను అని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే 4 నెలల్లో హంద్రీ నీవా కాలువల పనులు పూర్తి చేసే వాళ్లమని...కానీ 4 ఏళ్లు అయినా జగన్ ప్రభుత్వం కాలువల పనులు పూర్తి చెయ్యలేదని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్ స్యూరెన్స్ ఇవ్వడంతో పాటు కార్యకర్తలకు ఇంకా ఎలాంటి మేలు చెయ్యవచ్చు, ఆర్థికంగా వారిని ఎలా అభివృద్ది చేయాలన్న అంశాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తల, ప్రజల ఆమోదం ఉన్న వారికే పదవులు ఇస్తామని ఆయన తేల్చి చెప్పారు. మన ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనులు చేసి బిల్లులు పొందలేని వారికి వడ్డీతో సహా ప్రభుత్వం వచ్చిన తరువాత చెల్లిస్తామని తెలిపారు. ముందు మీ బిల్లులు చెల్లించిన తరువాతనే ఇతర కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
addComments
Post a Comment