కల్తీ చేస్తే కఠిన చర్యలు
తనిఖీకి ప్రత్యేక బృందాలు ఏర్పాటు
ధాన్యం కొనుగోలులో దళారీల వ్యవస్థను నిర్మూలించాం
రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి నాగేశ్వర్రావు
విజయనగరం, జూన్ 27 (ప్రజా అమరావతి) ః
ఆహార పదార్ధాలను కల్తీ చేస్తే కఠిన చర్యలను తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర్రావు హెచ్చరించారు. కల్తీ నిరోధానికి, తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమకు ముఖ్యమన్నారు. టీ పొడి, నిత్యావసరాలు, వంటనూనె నుంచి పాలు వరకు వివిధ రకాల ఆహార పదార్ధాలను కల్తీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కల్తీ నిరోదానికి ఫుడ్ సేప్టీ, విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బృందాలు విస్తృతంగా తనిఖీలను నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కల్గించే రంగులను కూడా ఆహార పదార్ధాల్లో కలపడం నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు రేషన్ షాపుల ద్వారా జొన్నలు, రాగులను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో జొన్నలను, ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాగులను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా రాగుల ఉత్పత్తిని, దిగుబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెళ్లడించారు. గిరిజనులు పండించే రాగులను, వారి పొలాలవద్దకే వెళ్లి కొనుగోలు చేస్తామని, మూడునాలుగు రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖను గాడిన పెట్టి, దానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఒక గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అని కొనియాడారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పౌర సరఫరాల శాఖను బ్రష్టు పట్టించారని విమర్శించారు. సుమారు రూ.20వేల కోట్లను చంద్రబాబునాయుడు ఈ శాఖనుంచి ప్రక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. దాదాపు రూ.4,900 కోట్లను పసుపు కుంకుమ కోసం ప్రక్కదారి పట్టించారన్నారు. అలాగే సుమారు రూ.13,500 కోట్ల రూపాయల అప్పు మిగిలిస్తే, తమ ప్రభుత్వ హయాంలో ఆ అప్పును తీర్చామని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల్లో సుమారు 17,94,000 మంది రైతులనుంచి, 2కోట్ల 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, తమ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగేళ్లలోనే 32,78,000 మంది రైతులనుంచి, 3కోట్ల, 10లక్షల, 72వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. వారి హయాంలో రైతులకు రూ.40,236 కోట్లు చెల్లించగా, తమ ప్రభుత్వం రూ.58,700 కోట్లను వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. చంద్రబాబునాయుడు దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తే, తాము ఆ వ్యవస్థను నిర్మూలించి, పూర్తి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గతంలో ముక్కుపోయిన బియ్యాన్ని సరఫరా చేస్తే, తమ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో గోధుమ పిండిని పంపిణీ చేశామని, అది విజయవంతం కావడంతో, జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని, కార్డుకు కిలో రూ.16 చొప్పున సరఫరా చేయనున్నామని ప్రకటించారు. రేషన్ డిపోలద్వారా పంపిణీ చేస్తున్న సరుకులన్నిటినీ కలిపి ఒక కిట్ రూపంలో అందజేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని మంత్రి వెళ్లడించారు. ఎండియు వాహనదారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
addComments
Post a Comment