జిల్లాలో మనబడి నాడు-నేడు రెండో విడత పెండింగ్ పనులు ఈవారం చివరికల్లా పూర్తిచేయాలి.



నెల్లూరు, జూన్ 19 (ప్రజా అమరావతి): జిల్లాలో మనబడి నాడు-నేడు రెండో విడత పెండింగ్ పనులు ఈవారం చివరికల్లా పూర్తిచేయాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. 


 సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్ నుంచి ఎంపీడీవోలు, ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ వెల్ఫేర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో నాడు నేడు పనుల వారాంతపు ప్రగతిపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 ఈ  కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు రెండో విడత ఎంపికైన పాఠశాలల్లో ప్రధానంగా మరుగుదొడ్లు, వంట గదులు, అదనపు తరగతి గదుల పెండింగ్ పనులు, మేజర్, మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిఫికేషన్ పనులను ఈవారం చివరికల్లా పూర్తిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఎక్కడా కూడా సిమెంట్ గడ్డకట్టి వృధా కాకుండా త్వరితగతిన వినియోగించుకోవాలన్నారు. జూనియర్ కాలేజీల్లో కూడా నాడు నేడు పనుల పురోగతిపై సమగ్ర శిక్ష ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఐఎఫ్ బి ప్యానల్స్, స్మార్ట్ టీవీ కి సంబంధించి వైరింగ్, ఎలక్ట్రికల్ సామాగ్రి మొదలైనవి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 

 అలాగే ప్రతి మండలంలో రెండవ ఎంఈఓ లు విధుల్లో జాయిన్ అయ్యారని, వీరందరూ విద్యాశాఖ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రధానంగా విద్యార్థుల హాజరు, బడి ఈడు పిల్లలందరూ బడికి వచ్చేలా, జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులందరూ వినియోగించుకునేలా పర్యవేక్షించాలన్నారు. పాఠశాలలో పేరు నమోదైన ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలో ఉండాలని,  జగనన్న గోరుముద్ద మెనూను ఎక్కడా లోటుపాట్లు లేకుండా  అమలు చేయాలని, ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పై అవగాహన కల్పించి, విద్యార్థులందరూ పాఠశాలలో భోజనం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 


తొలుత జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని నాడు నేడు పనుల పురోగతి, జగనన్న విద్యా కానుక పంపిణీ, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అటెండెన్స్ పై ఎంఈఓ లు, ఎండివోలు, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. 

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి,  ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఎస్ఈలు రంగవర ప్రసాద్, అశోక్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడిసి ఈఈ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 


Comments