విధుల్లో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు* - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.



*విధుల్లో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు* 

-  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్



బత్తిలి/పార్వతీపురం, జూన్ 9 (ప్రజా అమరావతి): విధుల్లో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. భామిని మండలం బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్ర వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులలో స్వల్ప తేడాలు గమనించిన జిల్లా కలెక్టర్ ఇకపై రికార్డుల నమోదు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ఇకమీదట ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది హాజరులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ శశికాంత్ బహుదూర్ ను గూర్చి వాకాబు చేయగా ట్రెజరరీ ఆఫీసుకు వెళ్లారని తెలియజేయగా, ట్రెజరరీ ఆఫీసుకు ఫోన్ లో వివరాలు అడిగారు. హాస్పటల్ సిబ్బంది ఎవరూ ట్రెజరీకి రాలేదు అని నిర్ధారించడంతో జీతం నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశించారు. నైట్ వాచ్ మాన్ వెంకటరావు గత 8 మసాల నుండి విధులకు రాకపోవడం గమనించిన కలెక్టర్ తగిన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గత 6 మసాలగా 15 మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ జరగడానికి గల కారణాలను ప్రశ్నించారు. శానిటేషన్, ఆపరేషన్ గది, ఓపి కార్డ్స్ క్షున్నంగా పరిశీలించారు. ప్రతీ శుక్రవారం ప్రభుత్వం నిర్దేశించిన గ్రామాలకు శానిటేషన్ చేయవలసి వుండగా ఇంతవరకు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. గత 6 మసాలా నుండి ఒక్క ప్రసవం కూడా జరగక పోవడంపై ఆరా తీయగా సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోవాలని డాక్టరు రవీంద్రను హెచ్చరించారు. ఆసుపత్రి ప్రసవాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీలను గుర్తించి ప్రసవ తేదీలను తెలియజేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రక్త హీనత కలిగినవారిపై పౌష్ఠికాహారం గూర్చి తెలియజేయాలని ఆయన సూచించారు. ఫ్యామిలీ డాక్టరు వైద్య ఆరోగ్య సేవలు పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అంటు వ్యాధులు, అంటువ్యాధులు కాని బిపి, మధుమేహం వంటి వాటిపై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. రానున్న వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ప్రభల కుండా స్ప్రేయింగ్ పక్కాగా జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది మంచి వైద్యం అందించాలని సూచించారు. దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారని వారికి వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. 


*పాఠశాల పనులు వేగవంతం చేయాలి*


నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాల భవనాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Comments