ఈనెలాఖరులోగా శాఖల వారీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరించండి:సిఎస్.

 ఈనెలాఖరులోగా శాఖల వారీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరించండి:సిఎస్.


విజయవాడ,19 జూన్ (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులుకు సంబంధించి పరిష్కరించాల్సిన వివిధ సమస్యలను ఈనెలాఖరు లోగా ఆయా శాఖల వారీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించి వాటిని  పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.ఉద్యోగుల డిమాండ్లు లేదా సమస్యలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలన్నీ ఈనెల 23,27,30 తేదీల్లో వారికి అనుకూలమైన ఏదో ఒక తేదీన శాఖల వారీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు.ఆవిధంగా శాఖల వారీ పరిష్కరించిన అంశాల నివేదికను సర్వీసెస్ శాఖ కార్యదర్శికి పంపాలని  సిఎస్ ఆదేశించారు.ఈఅంశాన్ని సర్వీసెస్ శాఖ కార్యదర్శి ఆయా శాఖలతో నిరంతరం మానిటర్ చేయాలని సిఎస్ స్పష్టం చేశారు.


ఒకవేళ సంబంధిత శాఖ స్థాయిలో పరిష్కారానికి అవకాశం లేని అంశాలను రాష్ట్ర స్థాయిలో  పరిష్కరించాల్సి ఉంటే  అలాంటి అంశాల నివేదికను సర్వీసెస్ శాఖ కార్యదర్శికి పంపాలని తెలిపారు. ఆవిధంగా  వివిధ శాఖల నుండి వచ్చిన అంశాలపై అజెండా రూపొందించి జూలై 5వ తేదీన నిర్వహించ ప్రతిపాదించిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్ డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


కావున సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రధ్ధ వహించి నెలాఖరు లోగా శాఖల వారీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఆయా అంశాలను చర్చించి  పరిష్కరించేందుకు కృషి చేయాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి పునరుద్ఘాటించారు.


Comments