రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అతి కీలకమైన పథకం రైతు భరోసా

 


నెల్లూరు, జూన్ 1 (ప్రజా అమరావతి): జిల్లాలో  ఈ ఏడాది  2,14,636 మంది రైతులకు తొలివిడత రైతు భరోసా- పిఎం కిసాన్ నగదు  రూ. 118 కోట్లు, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయున 1579 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదు రూ. 1.85 కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు  ముఖ్యమంత్రి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం  హరినారాయణన్ పేర్కొన్నారు. 


వైయస్సార్ రైతు భరోసా ఐదో విడత నిధులు, ఇన్పుట్ సబ్సిడీని కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయగా, నెల్లూరులోని  ముత్తుకూరు రోడ్డులో గల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్, జిల్లా వ్యవసాయ సలహా  మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. 


 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అతి కీలకమైన పథకం రైతు భరోసా


అని, ప్రతి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు  విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు పెట్టుబడి సాయంగా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం రైతు భరోసా- పిఎం కిసాన్ నగదు అందజేస్తుందన్నారు. అలాగే  మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం జమ చేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా నేరుగా రైతుల ఖాతాలకు ప్రభుత్వం నగదును జమ చేస్తుందని, వ్యవసాయానికి మేలు జరిగేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

 జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, యంత్రాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, రైతు భరోసా కేంద్రాలు రైతుకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అలాగే వ్యవసాయ పరీక్షల కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 

 తొలుత వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన చిరుధాన్యాలు, వైయస్సార్ యంత్ర సేవ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. 

  అనంతరం జిల్లాలో రైతులకు సంబంధించిన రైతు భరోసా నమూనా చెక్కులను రైతులతో కలిసి ఆవిష్కరించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ సంజనా సింహ, డిడి శివన్నారాయణ, ఏడీలు అనిత, నర్సోజి రావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


రైతుల అభిప్రాయాలు

......................... 

1).

రైతుకు ఇంత పెద్దఎత్తున ఎవరూ సాయం చేయలేదు

- ముక్కు మాధవయ్య, జయలక్ష్మి

ఆదర్శ రైతులు, మర్రిపల్లి, పొదలకూరు మండలం. 


మా గ్రామంలో మేము 2.62 సెంట్ల భూమిలో  వ్యవసాయం చేస్తున్నాము. మాకు ఆవులు సుమారు 30 వరకు ఉన్నాయి. మేము మా గ్రామంలో ఆదర్శ రైతులుగా గుర్తింపు పొంది ఎప్పటినుంచో వ్యవసాయం చేస్తున్నాము. మాకు క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, ఆవులు చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆలస్యం లేకుండా చెల్లిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలామంది ముఖ్యమంత్రులను చూసాము కానీ జగన్  లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. రైతులకు జగన్ లాగా ఎవరూ చెయ్యలేదు.. చెయ్యలేరు కూడా. అలాగే మా పాపకు అమ్మ ఒడి, నా భార్యకు ఆసరా డబ్బులు పడ్డాయి. రైతు గతంలో లాగా ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా సేవలు అందిస్తున్నారు. 


2). 

చెప్పినవన్నీ చేస్తున్నాడు

- ఊటుకూరు రమణయ్య, మైపాడు

- ముఖ్యమంత్రులు ఏదో చెప్తారు కానీ.. పూర్తిగా చేయలేరు. కానీ ఒక్క జగన్ మాత్రమే చెప్పిన ప్రతి ఒక్క మాట తప్పకుండా చేస్తున్నాడు. ముసలోళ్లకు, పిల్లలకు, ఆడోళ్లకు, నాలాంటి పేద రైతులకు అన్నీ చేస్తున్నాడు. మేము ఎవరి దగ్గరకి వెళ్లకుండా అన్ని మా గ్రామ సచివాలయం ద్వారా మాకు సాయం అందిస్తున్నాడు. నాలాంటి పేద రైతుకు రైతు భరోసా ఎంతో ఉపయోగపడుతుంది. జగన్ లాగా ఎవరూ గురించి, పేదల గురించి ఇంతలా ఆలోచన చేయలేదు. 


Comments