చిరుధాన్యాల సాగుతో పుష్క‌ల‌మైన‌ ఆర్థిక ప్ర‌యోజ‌నాలు.

 


*చిరుధాన్యాల సాగుతో పుష్క‌ల‌మైన‌ ఆర్థిక ప్ర‌యోజ‌నాలు*



*వాటిని పండించే రైతుల‌కు అన్ని విధాలా స‌హ‌కారం అందించాల్సి ఉంది

*వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఖ‌ర్చులు, ధ‌ర‌ల క‌మిష‌న్ ఛైర్మ‌న్ విజ‌య్ పాల్ శ‌ర్మ‌

*విశాఖ వేదిక‌గా సీఏసీపీ ద‌క్షిణాది రాష్ట్రాల‌ ప్రాంతీయ స‌ద‌స్సు

*ఉత్ప‌త్తి వ్య‌యానికి అనుగుణంగా మ‌ద్ధ‌తు ధ‌ర ఉండాల‌ని కోరిన ఏపీ వ్య‌వ‌సాయ మిష‌న్ వైస్ ఛైర్మ‌న్

*ఏపీలో అమ‌ల‌వుతున్న వ్య‌వ‌సాయ ఆధారిత ప‌థ‌కాలు, రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను వివ‌రించిన క‌మిష‌న‌ర్


విశాఖ‌ప‌ట్ట‌ణం, జూన్ 23 (ప్రజా అమరావతి) ః చిరుధాన్యాల‌ను సాగు చేసే రైతుల‌కు బంగారు భవిష్య‌త్తు ఉంద‌ని, పుష్క‌లమైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని సీఏసీపీ (వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఖ‌ర్చులు, ధ‌ర‌ల క‌మిష‌న‌న్) ఛైర్మ‌న్ ప్రొ. విజ‌య్ పాల్ శ‌ర్మ అన్నారు. వాటిని పండించే రైతుల‌కు అన్ని విధాలుగా స‌హ‌క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. 2024-25 మార్కెటింగ్ సీజ‌న్ ర‌బీ పంట‌ల ధ‌ర‌ల విధాన రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా విశాఖప‌ట్ట‌ణం వేదిక‌గా స్థానిక ది పార్కు హోట‌ల్లో వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఖ‌ర్చులు, ధ‌ర‌ల క‌మిష‌న్ ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ‌ స‌ద‌స్సు శుక్ర‌వారం జ‌రిగింది. సీఏసీపీ ఛైర్మ‌న్‌, స‌భ్యులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్య‌వ‌సాయ మిష‌న్ వైస్ ఛైర్మ‌న్, క‌మిష‌న‌ర్ల‌తో పాటు ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల నుంచి వ్య‌వ‌సాయ క‌మిష‌న్ల ప్ర‌తినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు, శాస్త్ర‌వేత్త‌లు, రైతులు త‌దిత‌రులు స‌ద‌స్సులో భాగ‌స్వామ్య‌మ‌య్యారు.


స‌ద‌స్సులో భాగంగా ముందుగా సీఏసీపీ విధి విధానాలు, నివేదిక రూప‌క‌ల్ప‌న‌, ధ‌ర‌ల విధానం, వ్య‌వ‌సాయ రంగ అనుకూల‌, ప్ర‌తికూల ప‌రిస్థితుల గురించి క‌మిష‌న్ ఛైర్మ‌న్, ఇత‌ర స‌భ్యులు వివ‌రించారు. దేశ వ్యాప్తంగా ఉన్న‌టువంటి ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకొని, ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల‌ను, ప్ర‌తినిధుల డిమాండ్ల‌ను దృష్టిలో ఉంచుకొని ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించేందుకు కేంద్రానికి సిఫార్సులు చేస్తామ‌ని సీఏసీపీ ఛైర్మ‌న్ ప్రొ. విజ‌య్ పాల్ శ‌ర్మ పేర్కొన్నారు. రైతులు, రైతు సంఘాల ప్ర‌తినిధుల అభిప్రాయాల‌ను త‌ప్ప‌కుండా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని, స్థానిక మార్కెట్ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని నివేదిక రూపొందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే సాధార‌ణ పంట‌ల‌కు బ‌దులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు రైతుల మ‌ళ్లేలా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్ర కృషి చేయాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధానంగా మిల్లెట్లు పండించే రైతుల‌కు అన్ని విధాలుగా స‌హ‌కారం అందించాల‌ని సూచించారు. అందుబాటులో ఉన్న పంట‌కు అనుగుణంగా మార్కెటింగ్ సౌక‌ర్యం కల్పించాల‌ని, నిల్వ సామ‌ర్థ్యాల‌ను పెంచుకోవాల‌ని పేర్కొన్నారు. చిరుధాన్యాల‌కు, ప‌ప్పు దినుసుల‌కు రానున్న రోజుల్లో మంచి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని, దానికి అనుగుణంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేవ‌లం ర‌బీ పంట‌ల‌కే కాకుండా అన్ని సీజ‌న్ల‌లో పండే పంట‌ల‌కు స‌రైన మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించేలా త‌మ వంతు కృషి చేస్తామ‌ని, దీనిలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. ఆహార‌, వాణిజ్య‌, ఉద్యాన పంట‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఇస్తూ సాగును ప్రొత్స‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌, రైతుల త‌ర‌ఫున స్థానిక డిమాండ్ల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ మిష‌న్ వైస్ ఛైర్మ‌న్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ధ‌ర‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్ల‌గా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామ‌ని సీఏసీపీ ఛైర్మ‌న్ విజ‌య్ పాల్ శ‌ర్మ పేర్కొన్నారు. స‌ద‌స్సులో భాగంగా స‌భ్యులు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన‌ రైతులు, రైతు సంఘాల ప్ర‌తినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు అక్క‌డున్న పరిస్థితుల‌ను వివ‌రించారు.


*ఉత్ప‌త్తి వ్య‌యానికి అనుగుణంగా మ‌ద్ధ‌తు ధ‌ర నిర్ణ‌యించాలి ః నాగిరెడ్డి*


పంట‌ల సాగులో అవుతున్న ఉత్ప‌త్తి వ్య‌యానికి అనుగుణంగా మ‌ద్ధ‌తు ధ‌ర‌లు నిర్ణ‌యించాల‌ని, రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్య‌వ‌సాయ మిష‌న్ వైస్ ఛైర్మ‌న్ ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి పేర్కొన్నారు. సీఏసీపీని రాజ్యాంగ బ‌ద్ధ సంస్థ‌గా ఉన్న‌తీక‌రించాల‌ని డిమాండ్ చేశారు. కేవ‌లం సూచ‌న‌లు, సిఫార్సులే కాకుండా రైతులు సంతోషంగా ఉండేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ధ‌ర‌ల క‌మిష‌న్ ముందు నాగిరెడ్డి ప్ర‌స్తావించారు. రాజ‌కీయ కోణంలో కాకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మ‌ద్ధ‌తు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని అభిప్రాయ‌పడ్డారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంద‌ని లేదంటే అటు రైతులు, ఇటు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. దేశంలోని రైతుల స్థితిగ‌తుల‌ను, ఇత‌ర ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి ఆహార భ‌ద్ర‌త‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి  ఉంద‌ని పేర్కొన్నారు.


*రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తోంది ః క‌మిష‌న‌ర్*


రైతుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తోంద‌ని రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ సి. హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న చ‌ర్య‌ల‌ను క‌మిష‌న్ స‌భ్యుల‌కు వివ‌రించారు. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు ప‌లు సేవ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. పంట కాలానికి గాను సాగుకు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఏడాదికి రూ.13,500 ఆర్థిక స‌హాయాన్ని అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇందులో  కేంద్ర సాయం రూ.6వేలు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌కాలంలో పెట్టుబ‌డి సాయం, ఇన్‌పుట్ స‌బ్సిడీ అందిస్తున్నామ‌ని, కౌలు రైతుల‌కు సీసీఆర్సీ కార్డులు అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. 72 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వివిధ ర‌కాల పంటలు సాగ‌వుతున్నాయ‌ని దానికి అనుగుణంగా సాగు విధానాలు, ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. రైతుల‌కు బీమా వ‌ర్తింప‌జేస్తూ ఆప‌ద‌కాలంలో ఆదుకుంటున్నామ‌ని, విప‌త్తుల స‌మ‌యంలో ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తున్నామ‌ని వివ‌రించారు. కేంద్ర విధానాల‌కు అనుగుణంగా ధ‌ర‌లు క‌ల్పిస్తున్నామ‌ని, మార్కెటింగ్ స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. ప‌శువుల‌కు త‌క్ష‌ణ వైద్యం అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా 400 అంబులెన్సుల‌ను స‌మ‌కూర్చామ‌ని పేర్కొన్నారు. రైతులు పండించిన పంట‌ల‌ను సకాలంలో సేక‌రిస్తున్నామ‌ని, గిట్టుబాటు క‌లిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. రైతులు పండించిన చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు మిల్లెట్లను అందిస్తున్నామని, ఇటీవల కాలంలో రాగి జావను కూడా అందజేశామని గుర్తు చేశారు. వివిధ అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా స‌భ్యుల‌కు వివ‌రించారు.


స‌దస్సులో సీఏసీపీ (వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఖ‌ర్చులు, ధ‌ర‌లు) క‌మిష‌న్ స‌భ్యులు డా. న‌వీన్ ప్రకాశ్ సింగ్‌, అనుప‌మ్ మిత్ర‌, ర‌త‌న్ లాల్ ద‌గా, ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ మిష‌న్ స‌భ్యులు, ఏపీ, తెలంగాణ, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల‌కు చెందిన రైతులు, రైతు సంఘాల ప్ర‌తినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు, విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.



Comments