కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎకె భల్లా ఢిల్లీ నుండి సిఎస్ లు డిజిపిలతో వీడియో సమావేశం.

 కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎకె భల్లా ఢిల్లీ నుండి సిఎస్ లు డిజిపిలతో వీడియో సమావేశం


అమరావతి,30 జూన్ (ప్రజా అమరావతి):దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో గల ప్రాంతాల్లో కనీసం మౌలిక సదుపాయాల కల్పన అనగా రహదారులు,సెల్ టవర్ల నిర్మాణం,వివిధ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించడం వంటి అంశాలపై శుక్రవారం ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,డిజిపిలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి భల్లా మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని సిఎస్,డిజిపిలకు సూచించారు.ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు తగిన రహదారి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఉన్నరహదారులను మెరుగుపర్చడంతో పాటు నూతన రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు.

ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల్లో పంచాయితీరాజ్ శాఖ ద్వారా 81 రహదార్లు,వంతెనలు తదితర పనులు ప్రగతిలో ఉండగా వాటిలో 24 పనులు మినహా మిగతా పనులన్నీ డిశంబరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. మిగతా పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయనున్నట్టు చెప్పారు.కొన్ని పనులకు అటవీ అనుమతులు రావాల్సి ఉందని దానిపై అటవీ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలో వేగవంతంగా పనులన్నీ పూర్తచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం,విశాఖ జిల్లా సహా శ్రీకాకుళం జిల్లాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదార్లు,వంతెనల నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సి ఉందని అందుకు కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు చేయాలని కోరగా అందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్సి అజయ్ కుమార్ భల్లా అంగీకరించారు.

ఇంకా ఈవీడియో సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త,అదనపు డిజిపి ఆపరేషన్స్ అండ్ గ్రేహాండ్స్ మీనా,ఐటి శాఖ కార్యదర్శి కోన శశిధర్,గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతి లాల్ దండే,పిసిసిఎఫ్ ఎకె ఝూ,ఐజి ఇంటిలిజెన్స్(ఎస్బి)వినీత్ బ్రిజ్వాల్,పంచాయతీరాజ్ ఇఎన్సి పిబి నాయక్,ఆర్ అండ్బి ఇఎన్సి మాధవి సుకన్య,ఎస్పి ఇంటిలిజెన్స్ ఎస్ఐబి బాబ్జి,తదితర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments