ప్ర‌భుత్వ అండ‌తో రైతుల్లో ధైర్యం / రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హిస్తుంది.



ప్ర‌భుత్వ అండ‌తో రైతుల్లో ధైర్యం / రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హిస్తుంది



చెర‌కు రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాం / ఉద్యోగుల బ‌కాయిలు త్వ‌ర‌లో చెల్లిస్తాం


బొబ్బిలి రైతుభ‌రోసా కార్య‌క్ర‌మంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌


 


విజ‌య‌న‌గ‌రం, జూన్ 01 (ప్రజా అమరావతి):


రైతులు పండించే పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర ప్ర‌క‌టించడ‌మే కాకుండా మ‌ద్ధ‌తు ధ‌ర‌కు కొనుగోలు చేస్తూ రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వ‌డంతో రాష్ట్రంలోని రైతుల్లో ధైర్యం ఏర్ప‌డింద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. రాష్ట్రంలో రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా అది ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా  భావించి వాటిని ప‌రిష్క‌రిస్తుంద‌న్నారు. రైతుల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ది త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలోనే అన్న విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. వైఎస్సార్ రైతుభ‌రోసా - పి.ఎం.కిసాన్ కింద వ‌రుస‌గా ఐదో ఏడాది తొలివిడ‌తగా రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేసే జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం గురువారం బొబ్బిలి మండ‌ల‌ప‌రిష‌త్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జిల్లాలోని 2.58 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.193.47 కోట్ల స‌హాయాన్ని అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన రైతుకు వెన్నుద‌న్నుగా నిల‌వాల‌నే ఉద్దేశ్యంతో మ‌న ముఖ్య‌మంత్రి రైతుభ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించార‌ని చెప్పారు. బొబ్బిలి ప్రాంతంలో చెర‌కు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వారికి చ‌క్కెర క‌ర్మాగారం ద్వారా రావ‌ల‌సిన‌ బ‌కాయిల‌ను చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకున్న ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌న్నారు. చెర‌కు రైతుల స‌మ‌స్య‌ల‌ను గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌న్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల‌ను కూడా త్వ‌ర‌గా చెల్లిస్తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.


 


జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్ మాట్లాడుతూ ఖ‌రీఫ్ సీజ‌నులో రైతుల‌కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డి స‌హాయం అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం రైతుభ‌రోసా స‌హాయం అందిస్తున్న‌ద‌ని చెప్పారు. వ్య‌వ‌సాయంతో పాటు అనుబంధ రంగాల్లో ప్రోత్స‌హించ‌డం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. దీనిలో భాగంగానే డైరీ వంటి రంగాల్లో రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. జిల్లాలో ఇటీవ‌ల మొక్క‌జొన్న మ‌ద్ధ‌తుధ‌ర పొంద‌డంలో స‌మ‌స్య‌లు వ‌స్తే ప్ర‌భుత్వం వెంట‌నే మార్క్‌ఫెడ్ ద్వారా 5 వేల ట‌న్నుల మొక్క‌జొన్న‌ను కొనుగోలు చేసి ఆదుకొంద‌ని చెప్పారు.


జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయ‌క‌ట్టు చివ‌రిలో వున్న ఎక‌రానికి కూడా సాగునీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. జిల్లాలో 6.50 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామ‌ని చెప్పారు.


శాస‌న‌స‌భ్యులు ఎస్‌.వి.చిన‌ప్ప‌ల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్లుగా అర్హ‌తే ప్రాతిప‌దిక‌గా సంక్షేమ ప‌థ‌కాల‌ను మంజూరు చేస్తోంద‌ని, అవినీతి లేని ప‌రిపాల‌న‌కు ముఖ్య‌మంత్రి శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌న రాష్ట్రం ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు.


ఈ సంద‌ర్భంగా జిల్లాలో రైతుల‌కు ఖ‌రీఫ్ సీజ‌నుకు విత్త‌నాల పంపిణీని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మొక్క‌జొన్న రైతుల‌కు విడుద‌ల చేసిన ఇన్‌పుట్ స‌బ్సిడీని కూడా మంత్రి చెక్కు రూపంలో అందించారు.


ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, మునిసిప‌ల్ చైర్మ‌న్ ఇంటి గోపాల‌రావు, వ్య‌వ‌సాయ శాఖ జె.డి. వి.టి.రామారావు, ఆర్‌.డి.ఓ. శేష‌శైల‌జ‌, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షుడు గేదెల వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇంటి గోపాల‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 


Comments