యువత భవితే లక్ష్యంగా ప్రణాళిక, కార్యాచరణ, పాలన : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

*యువత భవితే లక్ష్యంగా ప్రణాళిక, కార్యాచరణ, పాలన : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*యువత కోసం ఎవరేం చేశారో యువత ఆలోచించాలి*


*యువత భాగస్వామ్యమేలేని నారా లోకేశ్ 'యువగళం'*


*మాట్లాడిన పవన్ కు, విన్న ప్రజలకు ఏమీ పాలుపోని స్థితిలో 'వారాహి' యాత్ర*


*గెలిపించిన ప్రజలు,  మంత్రిగా సీఎం అవకాశం ఇవ్వడం వల్లే డోన్ లో అభివృద్ధి*


*నంద్యాల జిల్లా ప్యాపిలిలో 'యువత కోసం బుగ్గన' కార్యక్రమంలో ఆర్థిక మంత్రి*


ప్యాపిలి, జూన్, 29 (ప్రజా అమరావతి); యువత భవితే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక, కార్యాచరణ, పాలన చేపడుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. గురువారం ప్యాపిలిలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన 'యువత కోసం బుగ్గన' కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యమయ్యారు.  తనను గెలిపించిన ప్రజలు, మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వల్లే డోన్ అభివృద్ధి సాధ్యమైందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.


 యువత భాగస్వామ్యమేలేని నారా లోకేశ్ 'యువగళం' గందరగోళ పరిస్థితికి చేరిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ యువతకు ఏం చేస్తాడో చెప్పుకోలేని దయనీయ పరిస్థితే అందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతిలోని శ్రీసిటీ సెజ్ ను ఆపాలని శతవిధాల చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి పేర్కొన్నారు. యువత కోసం వైఎస్ ఆలోచిస్తే..వారి ఉపాధి అవకాశాలకు గండికొట్టాలని చూసిన వారు కూడా యువత గురించి మాట్లాడుతుండడం, యాత్రలు చేయడం హాస్యాస్పదమన్నారు.అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో  పెట్టుబడులు పెట్టాలని వచ్చిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు ఏ మాత్రం సహకారం అందించని నాయకుడు చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తలకు నచ్చిన ప్రాంతాలకు బదులు చంద్రబాబు చెప్పిన చోటే పరిశ్రమలు పెట్టేలా పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెచ్చినట్లు మంత్రి బుగ్గన ఆరోపించారు. 


*ఇది కాదా అభివృద్ధి? ఇదే కదా అభివృద్ధి..*


డోన్ నియోజవర్గ వ్యాప్తంగా నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్, బీసీ బాలుర పాఠశాల,కళాశాల, ఎస్సీలకు సోషల్ వెల్ఫేర్ స్కూల్, హాస్టల్ నిర్మాణాలు అభివృద్ధి కాదా? అంటూ ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు. కళ్లున్నా చూడలేని, చెవులున్నా వినలేని విపక్షాలు దొరకడం రాష్ట్ర యువత చేసుకున్న దురదృష్టమన్నారు. రాష్ట్రంలో హాస్టల్ సౌకర్యం గల ఏకైక ఐటీఐ కాలేజ్ డోన్ లో ఏర్పాటు చేయడం ప్రగతి కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. 'కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్' సెంటర్ ఏర్పాటు, ఉపాధి అవకాశాలు పెంచడం నిజం కాదా? అన్నారు. బేతంచెర్లలో పాలిటెక్నిక్ కాలేజ్, ఎమ్ఎస్ఎమ్ ఈ సెంటర్, ఐటీఐ కాలేజీల నిర్మాణం, ఉద్యోగావకాశాలకోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ టెర్మినల్ ఏర్పాటుకు వేగంగా పనులు జరుగుతుండడాన్ని ప్రతిపక్షం చూడాలేదా అన్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క 'ఐడీటీఆర్ ప్రాజెక్ట్' డోన్ లో ఏర్పాటు చేస్తుండడం డెవలప్ మెంట్ కాక మరేమిటన్నారు. డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వం వేసిన రహదారులపై మీరు ప్రయాణం చేయడం లేదా చెప్పాలన్నారు.


డోన్ లో గతంలో ప్రజల ప్రయాణంలో కేవలం సగం కూడా సమయం పట్టని విధంగా రోడ్లు తీర్చిదిద్దినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. తాగునీరు లేని ప్రాంతంలో ఇంటింటికీ నీరందించే వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్యాపిలిలో 20 ఊళ్ళకు చెరువులు అభివృద్ధి చేసి నీర  నింపడం , భూగర్భ జలాలు పెంచడం ప్రగతి కాదా? అన్నారు.  డోన్ లో నిన్నటి తరం సింగిల్ రోడ్లలో తిరిగితే..ఇక భవిష్యత్ లో డోన్ యువత అంతా డబుల్ రోడ్లపై ప్రయాణం చేసేలా రహదారులతో కళకళలాడుతున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్కులు, టూరిజం ప్రాంతాలు, బోటులో ప్రయాణాలు చేసేలా జరిగిన అభివృద్ధిని కళ్లు తెరుచుకుని ప్రతిపక్షాలు చూడాలని మంత్రి తెలిపారు. సమావేశ ప్రారంభానికి ముందు ఆర్థిక మంత్రి బుగ్గనని గజమాలతో  ప్యాపిలి మండలం యువకులు సత్కరించారు. మంత్రి బుగ్గనకి మిఠాయి పంచి  ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సభ అనంతరం ప్యాపిలి పట్టణంలోని రహదారులు,భవనాల శాఖ అతిథి గృహం ఆధునికీకరణ, పార్కు ఏర్పాటు పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు.


అంతకు ముందు ప్యాపిలి పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దర్శించుకున్నారు. ప్యాపిలికి వచ్చే సమయంలో 'ఐడీటీఆర్‌' ( డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థ) ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆగస్ట్ 15 కల్లా పనులు పూర్తి చేయాలని  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు.


'యువత కోసం బుగ్గన' కార్యక్రమానికి  రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు,  ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, ప్యాపిలి సర్పంచ్ లక్ష్మిదేవి, ప్యాపిలి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువతీయువకులు, తదితరులు హాజరయ్యారు.Comments