జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత వల్లే టిడ్కో గృహాల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు.

 *- జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత వల్లే టిడ్కో గృహాల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు


 *- టీడీపీ హయాంలోనే 90 శాతం పనులయ్యాయి*

 *- గత నాలుగేళ్లలో మిగిలిన 10 శాతం చేయలేకపోయారు* 

*- గృహాలివ్వడానికి ఇంత హంగామా అవసరం లేదు*

 *- భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేయడమెందుకు*

 *- ఈ ఖర్చులన్నింటిని ఎవరు భరిస్తున్నారు* 

 *- ఈ డబ్బును ఎక్కడినుండి తెచ్చి ఖర్చు చేశారో చెప్పండి* 

*- ఇదంతా ప్రజాధనమైతే  దుర్వినియోగం చేస్తారా*

 *- ఏర్పాట్ల పేరుతో కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు* 

 *- ఇంతకీ పేద ప్రజలకు మాత్రం న్యాయం జరగడం లేదు* 

 *- మీడియాతో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల* 



గుడివాడ, జూన్ 9 (ప్రజా అమరావతి): జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధత వల్లే కృష్ణాజిల్లా గుడివాడలో టిడ్కో గృహాల నిర్మాణం నేటికీ పూర్తికాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అభిప్రాయపడ్డారు. శుక్రవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం మల్లాయిపాలెంలో 8,912 టిడ్కో గృహాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. గుడివాడ పట్టణంలోని పేద ప్రజలకు టిడ్కో గృహాలను ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇంత హంగామా చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఈనెల తొమ్మిదో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ళను పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేయడం అనవసరమన్నారు. ఈ ఖర్చులన్నింటిని ఎవరు భరిస్తున్నారో చెప్పాలన్నారు. ఇంత డబ్బును ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలియాల్సి ఉందన్నారు. ఒకవేళ ఈ డబ్బంతా ప్రజాధనం అయితే దుర్వినియోగం  చేయడాన్ని కూడా తీవ్రంగా పరిణిస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారన్నారు. రాష్ట్రంలో అప్పులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియనిది కాదని అన్నారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో గృహాల ప్రారంభోత్సవం పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఏడాదికాలంగా పేదలకు ఇళ్లు ఇస్తామంటూ  మభ్యపెడుతూ వస్తున్నారన్నారు. ఇప్పటివరకు పలమార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎప్పటికప్పుడు టిడ్కో గృహాల లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతుందని చెప్పారు.

ఈసారైనా జగన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్లు వస్తాయని అనుకున్నా లబ్ధిదారులకు నిరాశే మిగిలిందన్నారు. భారీగా డబ్బులు ఖర్చు చేసి, నానా హంగామా, హడావుడి జరిగిన తర్వాత చివరి నిమిషంలో  జగన్ రెడ్డి పర్యటన వాయిదా పడడం తనను కలచి చేసిందన్నారు. టిడ్కో గృహాలకు ఇంకా మౌలిక వసతులను కల్పించలేదని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిని నమ్మకపోవడం వల్లే సీఎం జగన్ గుడివాడ పర్యటనకు రాలేదని అభిప్రాయపడ్డారు. టిడ్కో గృహాల విషయంలో నేటికీ పేదలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి టిడ్కో గృహాల విషయంలో సరైన దృష్టి సారించాలని కోరారు. డ్రైన్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా లబ్ధిదారులకు ఇళ్ళను అందజేస్తే ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వెనిగండ్ల విజ్ఞప్తి చేశారు.

Comments