రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టితో మహిళా సంఘాలు.

 

మచిలీపట్నం, జూన్ 27 (ప్రజా అమరావతి);


*రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టితో మహిళా సంఘాలు*



మన రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక పరిపుష్టితో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.


కృష్ణాజిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సేకరించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ రు.12.12 లక్షల మొత్తాన్ని మంగళవారం స్పందన మీటింగ్ హాల్లో జిల్లా/మండల సమాఖ్య సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారికి అందజేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు 2000 సం.లో కొద్ది గ్రూపులుగా ప్రారంభమై ఉద్యమంలా నేడు వేలాది గ్రూపులుగా 85 లక్షల మంది సభ్యులుగా అభివృద్ధి చెందాయనీ, సుమారు 8 వేల కోట్ల రూపాయల పొదుపు సాధించాయని అన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 2000 కోట్లు స్త్రీనిధి రుణాలు మహిళా సంఘాలు పొందుతూ సామాజిక పెట్టుబడి నిధిగ మరో 600 కోట్లు రొటేట్ చేస్తూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాయని అన్నారు ప్రభుత్వం వైయస్సార్ ఆసరా పథకం కింద 2019 ఏప్రిల్ 9 నాటికి రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తూ ప్రతి ఏడాది సుమారు 6000 కోట్లు తిరిగి నాలుగు విడతల్లో సభ్యులకు చెల్లిస్తోందని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోందని అన్నారు. సున్నా వడ్డీ పథకం కింద మరో 1400 కోట్లు ప్రభుత్వం మాఫీ క్రింద జమ చేస్తోందన్నారు.


దేశ రక్షణ మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణాలు పణంగా పెట్టి రక్షిస్తున్న సైనికుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళ స్వయం సహాయక సంఘాలు ఒక్కో సభ్యురాలు ఐదు రూపాయల చొప్పున రు.12,12,667/- సేకరించి సైనిక సంక్షేమానికి అందించడం అభినందించదగినదనీ అన్నారు. చేసేది చిన్న సహాయమైన స్వయం సహాయ సంఘాల నెట్వర్క్ వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమాఖ్య మండల సమాఖ్య సభ్యులను ఏపీఎంలను కలెక్టర్ అభినందించారు. ప్రతి ఏడాది ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు.


జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి సాధించేలా ఏపీఎంలు బాధ్యత తీసుకోవాలని, స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన లబ్ధిదారులకు 35వేల చొప్పున గృహ నిర్మాణానికి రుణాలు అందించామని, వారందరూ గృహాలు నిర్మించుకునేలా వారిని మోటివేట్ చేయాలనీ ఏపీఎంలకు కలెక్టర్ సూచించారు.


జగనన్న సురక్ష కార్యక్రమం కింద మహిళా సంఘాల్లో ప్రతి ఒక్కరు వారికి అవసరమైన 11 రకాలైన ధృవపత్రాలు వారి పరిధిలోని సచివాలయాల్లో పొందేలా యానిమేటర్స్ బాధ్యత తీసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ కళ్యాణ వీణ, పిడి డిఆర్డిఏ  పి ఎస్ ఆర్ ప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు టి. నాగమునెమ్మ, జిల్లా పరిశ్రమల అధికారి వెంకట్రావు, జిల్లా /మండల మహిళా సమాఖ్య సభ్యులు, ఏపిఎంలు పాల్గొన్నారు.


Comments