తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగడం లేదు..?: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

 రత్నగర్భ మహారాష్ట్రకు ఏం తక్కువ.. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగడం లేదు..?: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌



సోలాపూర్‌ (ప్రజా అమరావతి): కేంద్రంలో ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాల చేతగానితనం వల్ల స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంగళవారం సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా సర్కోలీ సభకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన భగీరథ్‌ బాల్కేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని, దేశం బాగు కోసం ప్రస్తుతం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.


దేశానికి ఒక లక్ష్యం అంటూ లేదా..?


కేంద్ర ప్రభుత్వాల చేతగాని తనాన్ని కేసీఆర్‌ ఎండగట్టారు. అసలు భారత దేశం లక్ష్యం ఏమిటని, దేశం ఒక లక్ష్యం లేకుండానే ముందుకు పోతోందా..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని సమస్యలకు పరివర్తన్‌ భారతే సరైన సమాధానమని అన్నారు. ఆ సమాధానం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇన్ని వనరులున్న దేశంలో విద్యుత్‌ సమస్య ఎందుకు వచ్చిందని..? కేసీఆర్‌ ప్రశ్నించారు. థర్మల్‌ విద్యుత్‌ తయారీకి పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు.


ప్రభుత్వాల చేతగానితనమే విద్యుత్‌ సమస్యలకు కారణం


దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు విద్యుత్‌ అందించే సామర్థ్యం మనకు ఉందని కేసీఆర్‌ చెప్పారు. కేంద్ర సర్కార్ల చేతగాని తనమే దేశంలో విద్యుత్‌ సమస్యలకు కారణమని మండిపడ్డారు. ఇకనైనా భారతదేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి సాధించాయని చెప్పారు. పొరుగు దేశం చైనా ఎక్కడుంది.. మనమెక్కడ ఉన్నామంటూ పోలిక లేవనెత్తారు. తెలంగాణలో తాము ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని తెలిపారు.


మాది A టీమ్‌, B టీమ్‌ కాదు.. రైతుల టీమ్‌, ప్రజల టీమ్‌


రత్నగర్భ అయిన మహారాష్ట్రకు ఏం తక్కువైందని కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగడంలేదని ఆయన ప్రశ్న లేవనెత్తారు. ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, శివసేన, బీజేపీలకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. తాము ఏ పార్టీకి A టీమ్‌, B టీమ్‌ కాదని, తమది రైతుల టీమ్‌.. ప్రజల టీమ్‌ అని కేసీఆర్‌ నొక్కి చెప్పారు.


భారత జలవిధానాన్ని బంగాళాఖాతంలో కలుపాలి


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా ఉంటే మహారాష్ట్రలో ప్రతి ఎకారకు సాగునీరు అందించవచ్చన్నారు. ఆ ప్రభుత్వాలు అనుకుంటే పుష్కలంగా తాగునీరు అందించవచ్చని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం అనుసరిస్తున్న జల విధానాన్ని బంగాళాఖాతంలో కలుపాలని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశానికి నూతన జలవిధానం అవసరమని అభిప్రాయపడ్డారు.

Comments