60 సంవత్సరాల సమస్యకు నేడు పరిష్కారం -చొరవ చూపిన జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు60 సంవత్సరాల సమస్యకు నేడు పరిష్కారం -చొరవ చూపిన జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు


సుమారు 400 మంది రైతులకు లబ్ధి 

పట్టాదారు పాసు పుస్తకాలు రుణాలు పొందుటకు అవకాశం


మచిలీపట్నం జూలై 7 (ప్రజా అమరావతి):


బాపులపాడు మండలం వెంకటాపురం గ్రామం సెక్షన్ 22 ఏ జాబితా నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తో కలిసి వెంకటాపురం గ్రామ రైతులకు ఈ ఉత్తర్వులు అందజేశారు.వివరాల్లోకి వెళితే


గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వెంకటాపురం గ్రామం ఇనాం గ్రామంగా రికార్డుల నందు నమోదు కాబడి ఆ గ్రామంలో 489.44 ఎకరాలు భూమి ఇనాం రద్దు చట్టం ప్రకారం పరిష్కారం అయిందా లేదా అనే విషయమై రికార్డులు లభ్యం కాక సుమారు 60 సంవత్సరాలుగా ఈ సమస్య అపరిస్కృతంగా ఉండిపోయింది.


వెంకటాపురం గ్రామంలోని భూములను సమీపంలోని చిరివాడ, గారపాడు గ్రామాల ప్రజలు సాగు చేసుకుంటూ అనేక సంవత్సరాలుగా సుమారు 400 మంది రైతులు జీవన భృతి పొందుతున్నారు.


2018 సంవత్సరంలో ఈ భూమిని సెక్షన్ 22 ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వలన ఆ గ్రామంలో భూములు కలిగిన రైతులు అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు.


గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ అభ్యర్థన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా  కలెక్టర్ పి రాజాబాబును ఆదేశించింది.


దీంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ భూమి రికార్డులను కలెక్టరేట్లోని రికార్డు గదులు, , బాపులపాడు మండల కార్యాలయంలోని రికార్డు గదులతో పాటు మంగళగిరిలోని రాష్ట్ర పురాతన రికార్డులు భద్రపరచు కార్యాలయంలో కూడా వెదకాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు రెవిన్యూ అధికారులు సిబ్బంది శ్రమించి అన్ని రికార్డులు పరిశీలించారు. ఆ గ్రామం పూర్వమే పరిష్కారం అయినట్లు అన్ని రికార్డులలో పట్టా భూమిగా నమోదు కాబడిందని తేలింది. అంతేకాకుండా 1928 సంవత్సరానికి సంబంధించిన భూమి కొలతల రికార్డు కూడా లభ్యమయింది. అలాగే 1972- 73 సంవత్సరాల అడంగళ్లు ఒరిజినల్ బాపులుపాడు కార్యాలయం  రికార్డు గదిలో లభ్యమయింది.


ఆ రికార్డులన్నీ పరిశీలించి ఆ భూమిని సెక్షన్ 22 ఏ జాబితా నుండి తొలగించేందు కోసం తనకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ  అధికారులకు సూచించారు.


ఆ మేరకు గుడివాడ రెవిన్యూ డివిజనల్ అధికారి పద్మావతి సమర్పించిన నివేదికను పరిశీలించి జిల్లా కలెక్టర్ రాజాబాబు  ఈనెల 6 వ  తేదీన గురువారం  వెంకటాపురం గ్రామానికి సంబంధించి పట్టా భూమి మొత్తం సెక్షన్ 22 ఏ జాబితా నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 27.17 ఎకరాల ప్రభుత్వ భూమిని సెక్షన్ 22 ఏ జాబితా నందు కొనసాగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.


తాజా ఉత్తర్వుల తో సుమారు 400 మంది రైతులు  లబ్ధి పొందుతున్నారు. వారు పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అన్ని విధాల అవకాశం లభించింది.


 ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు, శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.


Comments