నేటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ - 8,600 మంది అభ్య‌ర్ధుల రాక‌.


నేటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ - 8,600 మంది  అభ్య‌ర్ధుల రాక‌


పోలీసు శిక్ష‌ణ క‌ళాశాల మైదానంలో ఏర్పాట్లు - జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి వెల్ల‌డి

రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

విజ‌య‌న‌గ‌రం, జూలై 19 (ప్రజా అమరావతి): న‌గ‌రంలోని జూలై 20 నుంచి ఆగ‌ష్టు 2వ తేదీ వ‌ర‌కు అగ్నిప‌థ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వ‌హ‌ణ‌కు జిల్లా యంత్రాంగం, ఆర్మీ అధికారుల‌తో క‌ల‌సి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్ వెల్ల‌డించారు. శ్రీ‌కాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వ‌ర‌కు సుమారు 8,600 మంది  అభ్య‌ర్ధులు ప‌ద్నాలుగు రోజుల  పాటు న‌గ‌రంలోని పోలీసు శిక్ష‌ణ క‌ళాశాల మైదానంలో  నిర్వ‌హించ‌నున్న ఈ ర్యాలీకి హాజ‌రు కానున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే  రాత‌ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన అభ్య‌ర్ధుల‌కు ప‌రుగుపందెం, లాంగ్ జంప్‌, ఇత‌ర శారీర‌క ధారుఢ్య ప‌రీక్ష‌లు, వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆర్మీ అధికారులు తుది ఎంపిక‌లు చేస్తార‌ని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీ తొలిరోజున 970 మంది అభ్య‌ర్ధులు హాజ‌రు కానున్నార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చెప్పారు. న‌గ‌రంలోని పోలీసు శిక్ష‌ణ క‌ళాశాల మైదానంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి చేసిన ఏర్పాట్ల‌ను బుధ‌వారం సాయంత్రం జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, ఆర్మీ రిక్రూటింగ్‌ అధికారి జి.ఎస్‌.ర‌ణ్‌ధావా, విన‌య్ కుమార్‌ల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. ప‌రుగుపందెం నిర్వ‌హ‌ణ‌కు మైదానంలో చేసిన ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దీపాలు ఏర్పాట్లు, తాత్కాలిక మ‌రుగుదొడ్లు, తాగునీటి సౌక‌ర్యాల ఏర్పాటు, ఎంపిక‌ల సంద‌ర్భంగా అస్వ‌స్థ‌త‌కు గురైన అభ్య‌ర్ధుల‌కు అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయం, బ‌స్‌స్టాండు, రైల్వే స్టేష‌న్ నుంచి అభ్య‌ర్ధుల‌కు ర‌వాణా ఏర్పాట్లు, వ‌ర్షాలు కురిసిన‌ట్ల‌యితే ప‌రుగుపందెం నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యామ్నాయ ప్ర‌దేశాల గుర్తింపు తదిత‌ర అంశాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ అధికారుల‌తో స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్య‌ర్ధుల‌కు రిక్రూట్‌మెంట్ జ‌రిగే ప్ర‌దేశానికి చేరుకునే విధంగా ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేశామ‌న్నారు. వేదిక వ‌ద్ద‌కు చేరుకున్న వెంట‌నే అభ్య‌ర్ధుల ప్ర‌వేశ ప‌త్రాల‌ను ప‌రిశీల‌న చేసిన అనంత‌రం లోప‌లికి అనుమ‌తిస్తార‌ని,అభ్య‌ర్ధుల‌కు 1.6 కిలోమీట‌ర్ల ప‌రుగుపందెం నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. ఆర్మీ ప్ర‌మాణాల ప్ర‌కారం ఈ ప‌రుగుపందెంలో ఎంపికైన వారికి లాంగ్ జంప్‌, మ‌రికొన్ని శ‌రీర ధారుఢ్య ప‌రీక్ష‌లు,  ఆరోగ్య త‌నిఖీలు నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. అనంత‌రం విద్యార్ధుల ధృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న వుంటుంద‌న్నారు. రాత్రింబ‌వ‌ళ్లు ఇక్క‌డ రిక్రూట్‌మెంట్ జ‌రుగుతున్నందున నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. వ‌ర్షం కురిసినా రిక్రూట్‌మెంట్ ర్యాలీ  నిర్వ‌హ‌ణ‌కు ఇబ్బంది లేకుండా త‌గిన ఏర్పాట్లు చేశామ‌న్నారు. వైద్య స‌హాయం అందించేందుకు రెండు అంబులెన్స్‌లు, ఇద్ద‌రు వైద్యులు, స‌హాయ‌క సిబ్బందిని సిద్ధంగా వుంచ‌తున్న‌ట్టు చెప్పారు. ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అభ్య‌ర్ధుల‌కు అల్పాహారం, భోజ‌న వ‌స‌తులు కూడా స‌మ‌కూరుస్తున్నామ‌ని చెప్పారు. ఈ ప్రాంత అభ్య‌ర్ధులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని ఆర్మీకి అధిక సంఖ్య‌లో ఎంపిక‌వుతార‌ని ఆశిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు.

క‌లెక్ట‌ర్  వెంట మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌. శ్రీ‌రాములు నాయుడు, డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, సెట్విజ్ సి.ఇ.ఓ. రాంగోపాల్‌, రోడ్లు భ‌వ‌నాల శాఖ ఇ.ఇ. వెంక‌ట‌ర‌మ‌ణ‌, డి.ఇ. శ్రీ‌నివాస్‌, ఇ.పి.డి.సి.ఎల్‌. అధికారులు పాల్గొన్నారు.


Comments