రాష్ట్రంలోని రేషన్ డీలర్ల డిమాండ్లను 90 శాతం నెరవేర్చటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది.


.

విజయవాడ (ప్రజా అమరావతి ): రాష్ట్రంలోని రేషన్ డీలర్ల డిమాండ్లను  90 శాతం నెరవేర్చటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 29,795 మంది రేషన్ డీలర్లు తమ కమీషన్ పెంచాలని, పెండింగ్ బిల్లులు, ఇన్స్ రెన్స్, ఆరోగ్య భద్రత తదితర అంశాలపై తమ డిమాండ్లు నెరవేర్చాలని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. కమీషన్ పెంపు విషయం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారు కోరినట్లుగా కమీషన్ పెంపుకు కృషి చేస్తామన్నారు. డీలర్లు ప్రతిపాదించిన డిమాండ్లలో 90 శాతంకు పైగా అంగీకారం తెల్పినట్లు చెప్పారు. అలాగే  రేషన్ డీలర్లు స్టాక్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా తూకం వేసి అందిస్తామని, 2012 నుంచి అంటే గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనం కమీషన్ బకాయిలను సాధ్యమైనంత త్వరలో విడుదల చేయనున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ రేషన్ షాపు, గోడౌన్  ఒకచోటే ఉండేటట్లు సొంత భవనాలు నిర్మించనున్నామన్నారు.  ఆర్ బీ కే తరహాలో ప్రభుత్వమే ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతో ఈ నిర్మాణాలను చేపట్టనుందని చెప్పారు. ఇక అర్హులైన డీలర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించటంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యంఅందుబాటులోకి తీసుకురావటనికి కృషి చేస్తామన్నారు. గన్నీ బ్యాగ్ లు డీలర్లు ఉంచుకునే విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి రెన్యూవల్ చేయటంలో ఇబ్బందులు పడుతున్నామని డీలర్లు తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సౌలభ్యం కోసం ఆన్ లైన్ లో రెన్యూవల్ చేసుకునే విషయం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

                        కరోనా విపత్తులో ప్రాణాలు కొల్పోయిన డీలర్ల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందేవిధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఆయా కుటుంబాలకు న్యాయం చేస్తామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. రేషన్ షాపులు ఉండవన్న ప్రచారం నమ్మవద్దని, రేషన్ షాపులు, ఎండీయులు ఉంటాయని హామి ఇచ్చారు. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పంచదార, సన్న బియ్యంతో పాటు ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నామని వివరించారు. ఈ బియ్యంలో అధిక పోషక విలువలు ఉండటంతో పాటు ప్రోటీన్స్ ఉంటాయని, కొంతమంది ఫోర్టిఫైడ్ బియ్యంను ప్లాస్టిక్ బియ్యం అని అపోహ పడుతున్నరని అటువంటి అపోహలు వీడాలని, ఫోర్టిఫైడ్ బియ్యం వాడకంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. 

                  రాష్ట్రంలో ధరలు అదుపులో ఉండటానికి షాపుల ముందు బ్యానర్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎవ్వరైనా అధిక ధరలకు అమ్మితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 322 బియ్యం, 246 కందిపప్పు కేంద్రాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నామని చెప్పారు. ఎండీయు వాహనాలు నిరంతర పంపిణీకి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహణా విధానం కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కూడా ప్రశంసించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ జి. అరుణ్ పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.


Comments