ఎంఎస్ఎంఇ రంగంలో పెద్ద ఎత్తున యూనిట్లు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి.


 2023-24లో లక్షా 50 వేల ఎంఎస్ఎంఇ యూనిట్లు ఏర్పాటు ద్వారా 7 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం* ఎంఎస్ఎంఇ రంగంలో పెద్ద ఎత్తున యూనిట్లు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి


* అక్టోబర్ 2న పలు యూనిట్లు ప్రారంభానికి చర్యలు 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి 


విజయవాడ:1 జూలై (ప్రజా అమరావతి):రాష్ట్రంలో   వివిధ సూక్ష్మ,చిన్న మరియు మధ్యతరహా  (ఎంఎస్ఎఇ) యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతకు  పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు.శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఇ రంగంపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో 15వేల 625 కోట్ల ఖర్చుతో లక్షా 25వేల  యూనిట్లు నెలకొల్పి లక్షా 56వేల మందికి పైగా ఉపాధి కల్పించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 9వేల 677 కోట్ల ఖర్చుతో అనగా 62శాతం లక్ష్య సాధనతో 92వేల 707 యూనిట్లను 75శాతం లక్ష్య సాధనతో 3లక్షల 61వేల మందికి ఉపాధి కల్పించి ఉపాధి కల్పనలో 231శాతం లక్ష్యాన్ని సాధించినట్టు సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


కాగా 2023-2024 ఏడాదిలో మరో లక్షా 50 వేల యూనిట్ల నెలకొల్పి 7లక్షల 50వేల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు సిఎస్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఇ యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన భూముల గుర్తింపు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకునేలా తరచు కలెక్టర్లతో మాట్లాడాలని పరిశ్రమల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ ను  సిఎస్ ఆదేశించారు.


ఎంఎస్ఎంఇ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న వివిధ యూనిట్లను వచ్చే అక్టోబరు 2వ తేదీన ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఇ యూనిట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


ఒక జిల్లా ఒక ప్రాడక్టు అనే విధానం కింద ప్రతి జిల్లా నుండి కనీసం రెండు మూడు ఉత్పత్తులను గుర్తించి ఆప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పరిశ్రమల శాఖ, చేనేత జౌళి శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.ఇంకా ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించి పలు అంశాలను ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆయా అధికారులతో సమీక్షించారు.


అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ కె.ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఇ రంగంలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.రాష్ట్రంలో ఈకార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 69వేల 338 కోట్ల వ్యయంతో 3లక్షల 94వేల వివిధ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పబడి 34 లక్షల 84 వేల మందికి ఈ రంగంలో ఉపాధి కల్పించబడిందని తెలిపారు. ఎంఎస్ఇ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద వివిధ యూనిట్లు ఏర్పాటుకు 46 ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు అందాయని వివరించారు.


ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమం కింద 2022-23లో 6750  యూనిట్లు నెలకొల్పాల్సి ఉండగా 3069 యూనిట్లు నెలకొల్పి 25 వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.


ఒక జిల్లా ఒక ఉత్పత్తి లో భాగంగా ప్రాధమికంగా విశాఖ, కాకినాడ, గుంటూరు మూడు జిల్లాల నుండి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు కమీషనర్ ప్రవీణ్ కుమార్ వివరించారు.


సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ చేనేత జౌళి శాఖ కు సంబంధించి ఒక జిల్లా ఒక ఉత్పత్తికి కింద రాష్ట్రంలో 35 రకాల ఉత్పత్తులను గుర్తించామని చెప్పారు.ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ జెడి రామలింగేశ్వర రాజు తోపాటు  పలువురు పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.Comments