ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.



*ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తాం


*-* పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ .

*-* 4  రోజులు పాటు సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానంపై కార్యశాల 

*-*  అక్టోబర్ 2 నుంచి ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ పై సర్టిఫికేట్ కోర్సు ప్రారంభం 

విజయవాడ (ప్రజా అమరావతి);

పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రతి రోజూ అంకితభావంతో ఎక్కువ సమయం ఇష్టపడి శ్రమిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్  అన్నారు.  బుధవారం విజయవాడలో జరుగుతున్న 4  రోజులు పాటు సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానంపై కార్యశాలకు రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే నిజమైన నాయకులని అన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలని విద్యార్థులకు తప్పులు గుర్తింపజేసి వెంటనే వాటిని సవరించాలని అన్నారు.  ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులనీ, ఎప్పటికప్పుడూ నూతన విషయాలను ఉపాధ్యాయులు నేర్చుకుని విద్యార్థులను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్వీకరించాలన్నారు. 


డిజిటల్ అక్షరాస్యతలో మెలుకువలు పొంది జాతీయ సంస్థల నుంచి సాంకేతిక, సమకాలిక అంశాలను నేర్చుకుని మన పాఠశాలల్లో అమలు పరచాలని కోరారు. అక్టోబర్ 2 నుంచి మన రాష్ట్రంలో డిజిటల్ కంటెంట్ పై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించనున్నామని వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న ఫార్మటీవ్ అసెస్మెంట్ పరీక్షల్లో 5,9,12 తరగతులు వారికి టోఫెల్ పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తమ ఫలితాలకు క్రషి చేసిన 52 మంది ఆంగ్ల ఉపాధ్యాయులను ‘అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో గల ప్రతిష్ఠాత్మక ప్రిన్స్ టన్ యూనివర్శిటీ’లో శిక్షణకు పంపించనున్నామన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థిపై రోజుకు రూ. 20లకు పైగా ఖర్చు చేస్తున్నామని, ఇది జాతీయ స్థాయిలో ఐదు రెట్లు ఎక్కువని గుర్తు చేశారు. 2019లో మన రాష్ట్రంలో ప్రారంభమైన సీబీఎస్ఈ పాఠశాలలు 2024-25లో జరగనున్న సీబీఎస్ఈ బోర్డు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించనున్నామన్నారు.  ప్రస్తుతం మన రాష్ట్రంలో 1000 సీబీఎస్ఈ పాఠశాలల్లో 83 వేలమంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో గుణాత్మక విద్యను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి  చేయాలన్నారు.  సీబీఎస్ఈ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కి గమ్యాన్ని  త్వరలోనే చేరుకోనున్నామన్నారు.  రాష్ట్రంలో స్మార్ట్ టీవీ, ట్యాబులు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల ద్వారా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంచామని, ఉపాధ్యాయులు వీటి ద్వారా విద్యార్థులకు అన్ని అంశాలపై తర్ఫీదునిచ్చి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. డిజిటల్ కంటెంట్ ను ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ద్వారా ప్రతి ఒక్కరిలో సాంకేతిక పరిజ్ఞానంపై  కేంద్రీయ విద్యా సంస్థల అనుభవజ్ఞులచేత ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు.  ఇప్పటికే జాతీయ స్థాయిలో మన రాష్ట్ర విద్యార్థులు ముందంజలో ఉన్నారని, ఎయిమ్స్, ఐఐటీలలో సీట్లు పొందుతున్నారని కొనియాడారు.  విద్యలో టెక్నాలజీను అనుసంధానించడం ద్వారా రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యశాలలో  క్రిస్ప్ ఏపీ స్టేట్ లీడ్ శ్రీమతి ఉషారాణి , మోడల్ స్కూల్ సెక్రటరీ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి , శామో జాయింట్ డైరెక్టర్ శ్రీ బి.విజయభాస్కర్ , రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన ప్రిన్సిపాల్స్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఎస్సీఈఆర్టీ, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్, రూమ్ టూ రీడ్, అజిమ్ ప్రేమ్ జీ యూనివర్శిటీ ప్రతినిథులు పాల్గొన్నారు.










Comments