ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటాం.

 *ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటాం


*


*ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ  నిర్ణయం ఉండదు*


*ముస్లిం వర్గ మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పనిచేయదు* 


*యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గానికి అండగా నిలుస్తాం*


*టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు*


*కేంద్రం ప్రతిపాదిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ చట్టం పై తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలిపిన మత పెద్దలు, నేతలు*


*యూసిసి వల్ల కేవలం ముస్లిం వర్గానికే నష్టం అనే వాదన తప్పని వివరించిన నేతలు*


*మత స్వేచ్చకు అడ్డుపడే ఈ చట్టానికి మద్దతు ఇవ్వొద్దని చంద్రబాబు నాయుడుని కోరిన ప్రతినిధులు*



*టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*

అమరావతి (ప్రజా అమరావతి);

ముస్లిం వర్గ మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పనిచేయదని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గం నుంచి వచ్చిన సూచనలపై అధ్యయనం చేసి అండగా నిలుస్తామని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముస్లిం వర్గ సంక్షేమం, అభివృద్దికి, ముస్లిం మత విశ్వాసాలకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, వాటికి కట్టుబడి ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ను కలిసిన  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, పార్టీ మైనారిటీ నాయకులు యూనిఫాం సివిల్ కోడ్ చట్టం పై తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలిపారు. యూసిసి వల్ల కేవలం ముస్లిం వర్గానికే నష్టం అనే వాదన తప్పని నేతలు వివరించారు. యూసిసి వల్ల కలిగే నష్టాలు, తలెత్తే సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. మత స్వేచ్చకు అడ్డుపడే ఈ చట్టానికి మద్దతు ఇవ్వవద్దని చంద్రబాబు నాయుడుని ముస్లిం పెద్దలు, ప్రతినిథులు కోరారు. ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు పూర్తిగా విన్న తరువాత చంద్రబాబు నాయుడు వారిని ఉద్దేశించి మాట్లాడారు. ముస్లిం పెద్దలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ఇస్లామియా నూతన సంవత్సరంలో మొదటి రోజు  ముస్లిం సోదరులను కలుసుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులకు ఇస్లామియా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గ అభిప్రాయాలు, అభ్యంతరాలు ఈ సమావేశం ద్వారా తెలుసుకున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. బిల్లు విషయంలో మైనారిటీ వర్గ అభిప్రాయాలను టీడీపీ గౌరవిస్తుందని తెలిపారు. ఈ బిల్లు విషయంలో మీతోనే ఉంటాం. అన్ని విధాలా తోడుగా ఉంటాం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందరి మనో భావాలు కాపాడుకుందామని చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు ఆస్తిలో 1/3 వాటా ఇవ్వాలని పవిత్ర ఖురాన్ లో నాడే పొందుపరచబడిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ నాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల హక్కుల విషయంలో టీడీపీ మొదటి నుంచి ఆ వర్గానికి అండగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.


తెలుగు దేశం తోనే ముస్లి వర్గ సంక్షేమం, అభివృద్ది: తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ముస్లిం వర్గ అభివృద్దికి చేసిన నిర్ణయాలు, తీసుకువచ్చిన పథకాలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉర్ధూను రెండో అధికార భాషగా చేసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. లౌకిక పార్టీ అయిన తెలుగు దేశం మత సామరస్యానికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. నేడు ప్రశాంతమైన హైదరాబాద్ ఉంది అంటే దానికి కారణం  నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన విధానాలే అని చెప్పారు. మనుషులు అంతా ఒకటే..మతాలను గౌరవించాలి..ద్వేషించకూడదు అని చెప్పిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని అన్నారు. నాడు ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పోవాలి అంటే ముంబాయి వెళ్లాల్సి వచ్చేదని, హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి వారికి ప్రయాణ కష్టాలు లేకుండా చేశాం అని గుర్తు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో సమస్య వస్తే ముందుండి దాని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇమామ్ లకు,మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చామని, అబ్దుల్ కలాంను రాష్ట్ర పతిని చేశామని అన్నారు. ఎప్పుడూ మైనారిటీల మనోభావాలను గౌరవించే టీడీపీ నిర్ణయాలు తీసుకుంది అని అన్నారు. టీడీపీ హయాంలో ఆటోనగర్ లు కట్టాం, దుఖాన్ మకాన్, రంజాన్ తోఫా ఇచ్చాం అన్నారు. సంక్రాంతి కానుక ముస్లింలకు కూడా ఇచ్చి అందరూ కలిసి ఉండాలని నాడు కార్యక్రమాలు నిర్వహించాం అని చెప్పారు. ముస్లింలకు ప్రత్యేకంగా మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి మైనారిటీ విద్యార్థి చదువుకోవాల్సిన అవసరం ఉందని,  అందుకే విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు ప్రారంభించాం అన్నారు. తెలుగు దేశం పార్టీ ఎన్ డిఎ తో పొత్తులో ఉన్న సమయంలో మత సామరస్యం కోసం ఎలా పనిచేసిందో సమాజం చూసిందని అన్నారు. రాజకీయాల్లోకి ముస్లింలు ఎక్కువగా రాణించాల్సిన అసవరం ఉందని, పబ్లిక్ పాలసీలు తయారుచేసే రాజకీయాల్లోకి ముస్లిం వర్గం రావాలి అన్నారు. నంద్యాలలో వేధింపులతో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన నాడు తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. వక్స్ బోర్డు ఆస్తులు రక్షించింది తెలుగు దేశమేనని అన్నారు. పేదలు లేని సమాజం కోసం పీ 4 అనే విధానాన్ని తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. ముస్లిం వర్గంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అహ్ల్ సున్నత్ జమాత్, మశాఇక్ బోర్డ్, జమీయత్ ఏ ఉలేమా ఏ హింద్, జమాత్ ఏ ఇస్లామి హింద్, జమియాత్ ఆహ్లే హదీస్ సంస్థల ప్రతినిధులు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ, టీడీపీ మాజీ మంత్రి ఎన్ ఎండి ఫరూక్, శాసన మండలి మాజీ చైర్మన్ అహ్మద్ షరీఫ్, మాజీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, అక్తార్ చాంద్ బాషా, షాజహాన్ బాషా, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్, రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ రఫీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments