గంజాయి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్.

 *గంజాయి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్


*


*- రూ.2లక్షల విలువైన ద్విచక్ర వాహనం, రూ.80వేల విలువైన గంజాయి స్వాధీనం.*


*- కేసు వివరాలను వెల్లడించిన ఎస్ఈబీ జేడీ మహేష్.*


మంగళగిరి (ప్రజా అమరావతి):

గంజాయి కేసులో  నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనం,  రూ.80వేల విలువైన 2.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ జేడీ మహేష్ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని నవులూరు  ఎస్ఈబీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన గంజాయి కేసు వివరాలను వెల్లడించారు.  ఒరిస్సా రాష్ట్రానికి చెందిన తుటిక మనీష్ కుమార్, గుండ్ల సందీప్ లు కార్పోరేషన్ పరిధిలోని కుంచనపల్లి లోని ఓ అపార్ట్ మెంట్ లో నివశిస్తున్నారు.   మనీష్ కుమార్ వడ్డేశ్వరం కెఎల్ యూనివర్సిటీ లో బీకాం చదువుతుండగా సందీప్ అదే కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇరువురు గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో పాటు సులభ సంపాదనకు అలవాటు పడ్డారు. విశాఖపట్నం, ఒరిస్సా కు చెందిన కొందరి గంజాయి స్మగ్లర్లతో పరిచయం పెంచుకుని తాము విద్యను అభ్యసించే యూనివర్సిటీ లోని తోటి విద్యార్థులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన ఎస్ఈబీ అధికారులు పక్కా సమాచారంతో మెరుపు దాడి నిర్వహించి మనీష్ కుమార్, సందీప్ లతో పాటు వారి వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న దాసరి శ్రీకాంత్, వనమా విజయ వర్థన్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనం తో పాటు  సుమారు రూ. 80 వేల విలువైన 2.20కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ జేడీ మహేష్ తెలిపారు. విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి మాదకద్రవ్యాలు తీసుకుని తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని కోరారు. గంజాయి  విక్రయాలపై  నిరంతర  కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈబీ ఈఎస్ అన్నపూర్ణ, సీఐ మారయ్య బాబు, ఎస్ఐ మల్లిఖార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.


Comments