కృత్తివెన్ను(గరిశపూడి): జూలై 22 (ప్రజా అమరావతి);
*సచివాలయాలు ప్రజల అవసరాలు తీర్చే ఆలయాలు..*
*సర్టిఫికేట్ల కోసం పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా గడప వద్దకే సేవలు .. మంత్రి జోగి రమేష్*
గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రజల అవసరాలు తీర్చే ఆలయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
శనివారం కృత్తివెన్ను మండలం గరిశపూడి గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయానికి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడే జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రజలకు అవసరమైన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం మండల కేంద్రాలకు వెళ్ళవలసి వచ్చేదని, అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి అవసరమైన సేవలు సొంత గ్రామంలోనే పొందేలా వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సచివాలయం ద్వారానే లబ్ధిదారులకు అందిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు.
అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే 11 రకాల సర్టిఫికెట్లను అర్హులైన వారికి జారీ చేయడం, తద్వారా వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అర్హులకు వర్తింప చేయడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ విధంగా గరిశపూడి గ్రామ సచివాలయ పరిధిలోని పెదచందాల, గరిశపూడి, చినచందాల, దోమలగొంది, అంబేడ్కర్ కాలనీలలోని 278 మందికి వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందించామన్నారు.
గరిశపూడి గ్రామంలో ఉన్న వెల్నెస్ సెంటర్లో అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. 107 రకాల మందులతో పాటు 14 రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
గరిశపూడి నుంచి పడతడిక వరకు త్వరలో నూతన రోడ్డు నిర్మించనున్నామని, దీనితో పాటుగా గ్రామాల్లో అంతర్గత రహదారులను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కుల మత ప్రాంత పార్టీలకతీతంగా, ఎండా వాన తేడా లేకుండా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా చేరవేస్తున్న గ్రామ వాలంటీర్ల సేవలు అభినందనీయమని వారిని ప్రశంసా పత్రాలతో మంత్రి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్ రావు, ఏపీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పి.మహేష్, గ్రామ సర్పంచ్ నాగిడి నాగార్జున, కృత్తివెన్ను ఎంపీడీవో జి పిచ్చిబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
addComments
Post a Comment