అదనపు ఎఫ్సీవీ పొగాకు అమ్మకంపై జరిమానా మాఫీ

 అదనపు ఎఫ్సీవీ పొగాకు అమ్మకంపై జరిమానా మాఫీ



- పొగాకు రైతులకు అండగా ఉంటాం


- రాజమండ్రి ఎంపీ భరత్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం


రాజమండ్రి, జూలై 21 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 పంట సీజన్లో పొగాకు రైతులు ఉత్పత్తి చేసే అదనపు ఎఫ్ సీవీ పొగాకు అమ్మకంపై జరిమానాను మాఫీ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కు తెలిపింది. పొగాకు రైతులకు అమ్మకం జరిమానా మాఫీ చేయాలని, అదనపు ఎఫ్సీవీ పొగాకు అమ్మకాలకు అనుమతించమని ఎంపీ భరత్ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దానిపై కేంద్ర కామర్స్ ఇండస్ట్రీ, కన్స్యూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ టెక్స్ టైల్స్ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాత్రి ఎంపీకి సమాధానం ఇచ్చారు. ఎంపీ భరత్ విజ్ఞప్తికి స్పందిస్తూ తగు నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పొగాకు అమ్మకంపై జరిమానాను మాఫీ చేయడమే కాకుండా అదనపు ఎఫ్సీవీ‌ పొగాకు అమ్మకాలకు అనుమతిస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ ఎంపీ భరత్ కు తెలిపారు. అలాగే తుఫాను వర్షాల కారణంగా పంట నష్టపోయిన ఏపీలోని ప్రతి రైతు సభ్యునికి పొగాకు బోర్డు ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేలు పంట నష్టం రుణాన్ని అందించినట్టు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఎంపీ భరత్ కు తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, అవసరమైనప్పుడు వారికి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రికి ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments