రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేదం లేదు.
- రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేదం లేదు

- చిత్తూరు జిల్లాల్లోని 18 ఇసుక రీచ్ లలో మాత్రమే శాండ్ ఆపరేషన్స్ నిలిపివేశాం

- తాజాగా అన్ని పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఈ రీచ్ ల్లో తవ్వకాలు చేపడతారు

- 18 ఇసుక రీచ్ లకు ఎన్జీటి విధించిన జరిమానాపై సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది

- బి-1, బి-2 కేటగిరిలో ఇచ్చిన అనుమతులపై పున:సమీక్ష చేయాలని కోర్ట్ ఆదేశించింది

- అన్ని అనుమతులు ఉన్న రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి

- వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందుగానే నిల్వ చేశాం

- ప్రభుత్వంపై ఈనాడు ప్రతిక పనికట్టుకుని బురద చల్లుతోంది

- అధికారపార్టీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు అంటూ అబద్దపు రాతలు

- ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం

- పర్యావరణ పరిరక్షణకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం

- న్యాయస్థానం ఇచ్చిన అన్ని సూచనలను అమలు చేస్తాం: శ్రీ విజి వెంకటరెడ్డి, రాష్ట్ర గనులశాఖ సంచాలకులు


అమరావతి (ప్రజా అమరావతి):


రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేదం లేదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీపరీవాహక ప్రాంతాల్లో బి-2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరిలో 18 ఒపెన్ ఇసుక రీచ్ లకు ఇచ్చిన అనుమతులను న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. ఈ రీచ్ లకు సంబంధించి తాజాగా మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను సదరు సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తరువాతే ఈ 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పర్యావరణంకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ ఈ 18 రీచ్ లపై ఎన్జీటి విధించిన జరిమానాకు సుప్రీంకోర్ట్ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరిల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణశాఖ పున: సమీక్షించాలని కూడా న్యాయస్థానం సూచించిందని వివరించారు. 


రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన ఇసుక పాలసీని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా పర్యావరణానికి ఎక్కడా విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్ ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 18 ఇసుక రీచ్ లకు సంబంధించి ఎన్జీటిలో దాఖలైన కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వాటిల్లో తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని గనులశాఖ ఆదేశించిందని తెలిపారు. 


రాష్ట్రంలో వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణరంగానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్నిచోట్ల ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. వర్షాల వల్ల నదులు, జలాశయాల్లో ఇసుక తవ్వకాలకు విఘాతం ఏర్పడుతుందని, దీనివల్ల నిర్మాణపనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలోనే ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. 

 


వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచురించడమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రిక ఇష్టారాజ్యంగా వక్రీకరణలతో వార్తాకథనాన్ని ప్రచురించడంను తీవ్రంగా ఖండించారు. 'ఇంత లెక్కలేనితనమా? శీర్షికన కేంద్ర పర్యావరణశాఖ చెప్పినా... బేఖాతరు అంటూ అర్థంలేని రాతలు రాయడం దారుణమని అన్నారు. అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలోనే దందా అంటూ ఇసుక ఆపరేషన్స్ పై మళ్ళీ, మళ్ళీ తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్ ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు.

Comments