బాధ్యతారహితంగా చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు

 *- బాధ్యతారహితంగా చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు*


 *- గుడివాడ నియోజకవర్గంలోని  గ్రామాల్లో నడుంలోతు నీటిలో బతకాల్సి రావడం బాధగా ఉంది*

 *- ముంపు సమస్యలిలా ఉంటాయని పాలకులకు తెలియాలి కదా* 

 *- వెన్ననపూడిలో ప్రతి ఇంటికీ రూ.20వేల ఆర్ధికసాయమందించాలి* 

 *- వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆర్డీవోకు వినతిపత్రమందిస్తాం* 

 *- ప్రజలేం తప్పు చేయలేదు, వారికి నష్టపరిహారం పొందే హక్కుంది*

 *- వెన్ననపూడిలో పర్యటించిన అనంతరం మీడియాతో వెనిగండ్ల* గుడివాడ మెయిల్, జూలై 28 (ప్రజా అమరావతి): పాలకులు బాధ్యతారహితంగా చేసిన తప్పులకు ప్రజలు శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదని, గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ నడుం లోతు వరదనీటిలో బతకాల్సి రావడం బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం వరదనీటిలో పూర్తిగా చిక్కుకుపోయిన వెన్ననపూడి, శివారు కాలనీలో పర్యటించి అక్కడి పరిస్థితులను చూసి చలించిన వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. నందివాడ మండలం వెన్ననపూడి గ్రామం శివారు కాలనీ పూర్తిగా వరదనీటిలో మునిగిపోయిందని తెలిసి ఇక్కడకు వచ్చానన్నారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఇళ్ళ చుట్టూ నడుం లోతు నీరు చేరిందని, వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరదనీరు అంతకంతకు పెరుగుతోందన్నారు. పూడుకుపోయిన కాల్వల్లో వరదనీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీరు ఎగదన్ని వెన్ననపూడి కాలనీని ముంచెత్తుతోందన్నారు. ఇళ్ళ ముందు రోడ్డు కూడా కన్పించడం లేదన్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని, గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మనుషులు ఇలా బతకాల్సి రావడంపై చాలా బాధగా ఉందన్నారు. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానన్నారు. ఇక్కడి పరిస్థితులను చూసి వెంటనే మండల తహసీల్దార్ కు సమాచారం ఇచ్చానని తెలిపారు. వెంటనే స్పందించి వచ్చారన్నారు. పాలు, బ్రెడ్, బియ్యం ఇస్తానని చెప్పారని, పప్పు, నూనె కూడా ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ముంపు సమస్యల విషయంలో ఇప్పటికిప్పుడు చేయాల్సిందేమీ కల్పించడం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాల్సిందేనని. అభిప్రాయపడ్డారు. ముందుచూపు లేని వ్యక్తులు పరిపాలిస్తే ఇలానే ఉంటుందన్నారు. వరదనీరు ప్రవహించే దారులన్నీ ఎక్కడికక్కడ పూడుకుపోయాయన్నారు. అందువల్లే అకాల వర్షాలకు గ్రామాలు పూర్తిగా నీటమునిగే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజలంతా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్ళ నుండి ప్రజలను తరలించడానికి ప్రయత్నం చేయవచ్చని, కోళ్ళు, గేదెలు కూడా ఇళ్ళ దగ్గరే ఉండిపోయాయన్నారు. ముంపు వల్ల ప్రజలు ఇళ్ళను వదిలేసి వెళ్ళలేక, ఉండలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో వెనిగండ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ అందుబాటులోనే ఉందన్నారు. అక్కడి నుండి ప్రతి ఇంటికీ 20లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. చేతనైనంత సాయాన్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతకాల్సిన అవసరం లేదని ప్రజలంతా గుర్తించాలన్నారు. బాధ్యతారహితంగా వ్యక్తులు చేసే తప్పులకు ప్రజలంతా అనుభవించాల్సిన అవసరం లేదన్నారు. అకాల వర్షాలకు ఇంతటి వరదనీరు వస్తుందని ప్రజలకు తెలియకపోవచ్చని, పరిపాలించే వారికి తెలియాలన్నారు. రీజనింగ్ లేని ప్రభుత్వమే రాష్ట్రంలో నడుస్తోందన్నారు. సరైన ఆలోచన కూడా లేదన్నారు. కనీసం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి రూ.15 వేల నుండి రూ.20వేల వరకు నష్టపరిహారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వరదనీరు తగ్గుముఖం పట్టిన వెంటనే గ్రామస్థులతో కలిసి ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు. స్థలం ఇస్తే ఇళ్ళు కట్టుకున్నారని, ప్రజలేం తప్పు చేయలేదున్నారు. నష్టపరిహారం పొందే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు.

Comments