ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

 *ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి*


*: అధికారులు అలసత్వం వీడి పని చేయాలి*


*: భవనాల నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 07 (ప్రజా అమరావతి): 


ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, తదితర భవనాల నిర్మాణంపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల భవనాల నిర్మాణంలో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకునేందుకు వెనకాడమన్నారు. అధికారులు అలసత్వం వీడి పని చేయాలని, భవనాల నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టాలన్నారు. సెప్టెంబర్ 15నాటికి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకునుగుణంగా భవనాల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చేరుకోవాలని, ఆయా మండలాలకు ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేపట్టాలని, పనులు చేయకపోతే మరో ఏజెన్సీతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలన్నారు. రూఫ్ లెవెల్ లో ఉన్నవి ఫినిషింగ్ స్టేజికి తీసుకురావాలని, పూర్తయ్యే దశలో ఉన్నవి వెంటనే పూర్తి చేయాలన్నారు. ఫిజికల్ గా పూర్తి అయినవి జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తయి హ్యాండోవర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నవి వెంటనే హ్యాండోవర్ చేయాలన్నారు. అధికారులు భవనాల నిర్మాణాన్ని నిత్యం మానిటర్ చేయాలన్నారు. జూలై 15 నాటికి కేటాయించిన లక్ష్యాలలో పురోగతి తక్కువగా ఉందని, కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలన్నారు. మళ్లీ సమావేశం నిర్వహించే నాటికి భవన నిర్మాణాల్లో కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా తప్పనిసరిగా పురోగతి ఉండాలని ఆదేశించారు.


ఈ సమావేశంలో పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, ఈఈ మురళీమోహన్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, పీఆర్ డిఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.



Comments