ప్రజలకు అన్ని విధాలా మేలు చేయాలి.

 ప్రజలకు అన్ని విధాలా మేలు చేయాలి*


*: సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాలి*


*: అధికారులు బాధ్యతగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి*


*: జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 14 (ప్రజా అమరావతి):


ప్రజలకు అన్ని విధాల మేలు చేసేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశించారు.


పుట్టపర్తి కలెక్టరేట్ లోని స్పందన సమావేశం మందిరంలో శుక్రవారం పుట్టపర్తి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరామ్ అధ్యక్షతన నిర్వహించగా, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, పుడా చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులు దృష్టికి వచ్చిన సమస్యలు అన్ని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించి అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. నవరత్నాల ద్వారా పూర్తిస్థాయిలో 100 శాతం అర్హత కలిగిన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం జరుగుతోందని, ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరికీ మేలు చేసేందుకే తమ ప్రభుత్వం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, అందుకు అనుగుణంగా అధికారులంతా పనిచేయాలన్నారు. సమీక్ష సమావేశం దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వచ్చే సమావేశం నాటికి పరిష్కరించేలా అధికారుల కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ అవినీతి జరగకుండా చూడాలని, అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు . జిల్లా అభివృద్ధి కొరకు పారిశ్రామికవేత్తలను మరియు ఎన్ టి పి సి  అధికారులతో మరియు జిల్లాలోని  శాసనసభ్యులు  అంగీకారంతో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఆగస్టు నెలలో ఒక సమావేశం నా ఆధ్వర్యంలో  నిర్వహించాలని తెలిపారు. మైన్స్ అధికారులు, మరియు జిల్లా ప్లానింగ్ అధికారి, జిల్లా పరిశ్రమల అధికారులు సంయుక్తంగా కలసి అనంతపురం జిల్లాలో సిపిఓ  సంప్రదించి మన జిల్లాకు రావలసిన నిధులు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సి ఎస్ ఆర్ ఫండ్ నిధులపై   త్వరితగతిన  ప్రణాళికల అమలు చేయాలని తెలిపారు. సి ఎస్ ఆర్  నిధులు ద్వారా జిల్లా లోని  పలు గ్రామాలను, ఎస్సీ కాలనీలో, గిరిజనుల కాలనీలను, అభివృద్ధి చేయవచ్చునని తెలిపారు, నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలతో 412 సిసి రోడ్లు నిర్మాణం పనులు  వేగవంతం చేయాలని, పుట్టపర్తి  అండర్డ్రైనేజ్ స్కీము, అమృత పథకం ఫేస్ టు నందు, నల్ల మాడ నందు ఆర్డబ్ల్యూ  ఎస్ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సాయం అందించాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని, అధికారులంతా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో 193 చెరువులకు నిరందించేదుకోసం భూసేకరణ చేపట్టాలని, గాజులపల్లి, నల్లమడ రిజర్వాయర్ల నిర్మిస్తుండగా, భూసేకరణ పూర్తి చేసి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు నిర్మిస్తున్న ఎన్హెచ్ 342 రహదారి పనులు వేగవంతంగా జరగాలని, రహదారి పనులు అక్టోబర్ నాటికి పూర్తి కావాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి దీనిపై సమావేశం నిర్వహించాలన్నారు. ఎన్ హెచ్ 716 జి రహదారిలో భాగంగా జంక్షన్ ల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలన్నారు. లోవోల్టేజ్ కారణంగా విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని, వచ్చే అక్టోబర్ నాటికి వేగంగా జగరాజుపల్లి, టి.కుంట్లపల్లి, నల్లమడ, వెస్ట్ గేట్ సబ్స్టేషన్లో పూర్తి చేయాలని, ఇందుకోసం భూమిని గుర్తించాలన్నారు. ఇది వెనుకబడిన జిల్లా అని, పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ 220 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో మండలానికి 300 నుంచి 400 విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఓడి చెరువులో ఏర్పాటు చేస్తున్న 132 కెవి సబ్స్టేషన్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నల్లమడ మార్కెట్ యార్డ్ పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. హౌసింగ్ సంబంధించి నియోజకవర్గంలో 25 వేల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని, సమాచార లోపం లేకుండా చూసి నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎవరైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ అండ్ బి పరిధిలో పెడబలి నుంచి గాజులకుంటపల్లి రహదారిని ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని, అలాగే మలక వేమల నుంచి ఓడి చెరువు, ఇతర రహదారులను సకాలంలో చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న సిసి రోడ్లు త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ.. పుట్టపర్తి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో వచ్చే 1, 2 నెలల్లోగా పురోగతి చూపించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో వివిధ రకాల సమస్యలు, అభివృద్ధి పనులపై జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు, పుట్టపర్తి ఎమ్మెల్యే అందించిన సూచనలు, సలహాలు అధికారులు పాజిటివ్ గా తీసుకోవాలన్నారు. అధికారులంతా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వచ్చే సమావేశం నిర్వహించే నాటికి అభివృద్ధి పనుల్లో పురోగతి చూపించాలన్నారు. సబ్ స్టేషన్ ల ఏర్పాటు, ఉపాధి పనులు, కృషి విజ్ఞాన కేంద్రానికి భూ కేటాయింపు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గంలో సబ్స్టేషన్లు ఏర్పాటు విషయమై భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖలో కొత్తగా 971 కరెంటు పోల్స్ మంజూరు కాగా వాటిని వెంటనే అవసరమైన చోట ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో 220 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. హౌసింగ్ కింద జిల్లాలో ప్రాధాన్యత ప్రకారం ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలన్నారు. సమావేశంలో వచ్చిన సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రికి జిల్లా కలెక్టర్ నంది విగ్రహాన్ని బహుకరించి సత్కరించారు.ఈ సమావేశంలో ఆర్డీవోలు భాగ్య రేఖ, రాఘవేంద్ర, సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిపిఓ విజయ్ కుమార్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్ వెల్ఫేర్ శివరంగ ప్రసాద్, బిసి వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆ శాఖల డిఈలు, ఏఈ, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments