చిరుధాన్యాలకు మ‌హ‌ర్ధ‌శ‌.



చిరుధాన్యాలకు మ‌హ‌ర్ధ‌శ‌


ఎల్‌.కోట‌లో ఆరోగ్య‌ మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్

నేడు ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న రెడ్డి

జిల్లాలో రాగి పంట‌ విస్తీర్ణం పెంచ‌డానికి ప్ర‌త్యేక‌ ప్ర‌ణాళిక‌లు


విజ‌య‌న‌గ‌రం, జులై 24 (ప్రజా ఃఅమరావతి );

                  ఇక‌నుంచీ చిరుధాన్యాలు సిరులు కురిపించ‌నున్నాయి. రైతు క‌ష్టానికి త‌గిన గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌డంతోపాటు, చిరుధాన్యాల సాగుకు మ‌రింత‌ ప్రోత్సాహం ల‌భించ‌నుంది. ఎల్‌.కోట మండ‌లం రేగ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మిల్లెట్స్‌ ప్రాసెసింగ్ యూనిట్‌ను, సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి, తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ ఫ్యాక్ట‌రీని ప్రారంభిస్తారు.


*రూ.4 కోట్ల‌తో ప్రాసెసింగ్‌ యూనిట్‌*

                 రాష్ట్రీయ కృషి వికాశ యోజ‌న ప‌థ‌కం క్రింద‌, సుమారు రూ.4.06 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో, ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. కొత్త‌వ‌ల‌స ప్రాంతానికి చెందిన‌ సుమారు 1500 మంది చిన్న స‌న్న‌కార‌ మ‌హిళా రైతులు స‌భ్యులుగా ఉన్న ఆరోగ్య‌ రైతు ఉత్ప‌త్తిదారుల‌ సంఘం ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్వ‌హిస్తుంది. దీనిద్వారా ప్ర‌త్య‌క్షంగా 30 మందికి ఉపాధి ల‌భిస్తుంది. ప్ర‌ధానంగా రాగి పంట ఈ యూనిట్‌కు ముడిస‌రుకు కానుంది. ఇక్క‌డ రాగుల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంతోపాటు, రాగి పిండి, మిల్లెట్ బిస్కెట్లు, న్యూట్రిష‌న్ పౌడర్స్‌, వ‌ర్మిసెల్లీ, ఫ్లేక్స్‌ తదిత‌ర‌ ఆహార ప‌దార్ధాల‌ను ఇక్క‌డ ఉత్ప‌త్తి చేయ‌నున్నారు. వీటితో పాటుగా జొన్న‌లు, కొర్ర‌లు, సామ‌లు, స‌జ్జ‌లు త‌దిత‌ర ర‌కాల‌ చిరుధాన్యాలను కూడా ఇక్క‌డ ప్రాసెస్ చేసి విక్ర‌యిస్తారు. ఈ యూనిట్‌లో ఏర్పాటు చేసిన మిష‌న‌రీ ద్వారా గంట‌కు 500 కిలోల చిరుధాన్యాల‌ను ప్రాసెస్ చేయ‌డంతోపాటుగా, గంట‌కు 300 కిలోల రాగిపిండి, 200 కిలోల మిల్లెట్ ఫ్లేక్స్‌, 40 కిలోల కుకీస్‌, 30 కిలోల మిక్సర్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంది.  విజ‌య‌న‌గ‌రం, అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల నుంచి చిరుధాన్యాల‌ను కొనుగోలు చేస్తారు.


*పెర‌గ‌నున్న చిరుధాన్యాల సాగు*

                 జిల్లాలో చిరుధాన్యాల సాగు భారీగా విస్త‌రించ‌నుంది. చిరుధాన్యాల పంట‌ల‌కు ఉత్త‌రాంధ్ర ఎంతో అనుకూల ప్రాంతం. ఇటీవ‌ల కాలంలో బిపి, షుగ‌ర్ లాంటి జీవ‌న శైలి వ్యాధులు ఎక్కువైపోతుండ‌టంతో, ప్ర‌జ‌ల దృష్టి చిరుధాన్యాల‌వైపు మ‌ళ్లింది. ఆరోగ్యం, పోష‌కాల కోసం చిరుధాన్యాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవ‌త్స‌రంగా ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌క‌టించ‌డం, కేంద్ర ప్ర‌భుత్వం మిల్లెట్ మ‌హోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తుండంతో, చిరుధాన్యాల‌వైపు అంద‌రి దృష్టీ మ‌ళ్లింది. దీంతో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కూడా చిరుధాన్యాల సాగును ప్రోత్స‌హిస్తోంది. రేష‌న్ డిపోల ద్వారా రాగి పిండి స‌ర‌ఫ‌రా చేయ‌డానికి నిర్ణ‌యించింది. దీనికోసం రాగి పంట ఎంత పండించినా కొనుగోలు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాపై ప్ర‌త్యేక‌ దృష్టి పెట్టి, రాగి పంట సాగును రెట్టింపు చేయాల‌ని ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. దీనిలో భాగంగా అధిక దిగుబ‌డి, పోష‌కాల‌నిచ్చే రాగి వంగ‌డాల‌ను రైతుల‌కు అందిస్తోంది. జిల్లాలో ఖ‌రీఫ్‌లో రాగి పంట సాధార‌ణ విస్తీర్ణం 32 హెక్టార్లు కాగా, దానికి ఈ ఏడాది 844 హెక్టార్ల‌కు పెంచడానికి నిర్ణ‌యించారు. అలాగే ర‌బీలో రాగి సాగు 1000 హెక్టార్లు ఉండ‌గా, దానిని నాలుగింతలు చేసి, సుమారు 4000 హెక్టార్ల‌కు పెంచాల‌న్న ప్ర‌ణాళికను రూపొందించారు.


*మిల్లెట్స్ సాగుకు ప్రోత్సాహం*

నాగ‌ల‌క్ష్మి, జిల్లా క‌లెక్ట‌ర్‌

                 జిల్లాలో చిరుధాన్యాల సాగును పెంచేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాం. రైతుకు మేలైన విత్త‌నాల‌ను అందించ‌డంతోపాటుగా, మార్కెటింగ్ సౌక‌ర్యాల‌ను విస్తృతం చేస్తాం. ముఖ్యంగా రాగి పంట‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాం. మిల్లెట్స్‌ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించ‌డానికి ముందుకు వ‌చ్చేవారికి జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తాం.


Comments